చాలా మంది ఉదయమే కాకుండా మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి పూట కూడా కాఫీ, టీలు తాగుతుంటారు. కానీ కాఫీని అతిగా తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. కానీ రోజుకు రెండు సార్లు కాఫీని తాగితే లాభమే.!
కొంతమంది టీ, కాఫీలను తాగకుండా అస్సలు ఉండలేరు. ఎందుకంటే ఈ అలవాటు ఒక వ్యసనంలా మారుతుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతిరోజూ కాఫీ తాగడం వల్ల ఎలాంటి హాని కలగదు. కానీ ఎక్కువ కాఫీ హానికరం అంటున్నారు.
నిపుణుల ప్రకారం.. కాఫీ తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కాఫీలో ఉండే కెఫిన్ మన శక్తి స్థాయిలను పెంచడానికి, ఏకాగ్రతను, అప్రమత్తతను పెంచడానికి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
శారీరక శ్రమ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాఫీ తాగితే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు డయాబెటీస్ రిస్క్ ను తగ్గిస్తాయి.
కానీ కాఫీ తాగడానికి బెస్ట్ టైం ఏంటో చాలా మందికి తెలియదు. ఉదయం నిద్రలేచిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత కాఫీ తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. ఉదయం లేవగానే ఒక గ్లాసు నీళ్లు తాగి, 2 గంటల తర్వాత కాఫీ తాగాలట.
బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత కాఫీని తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది మీ శరీరాన్ని రీహైడ్రేట్ చేస్తుంది. రోజంతా మిమ్మల్ని ఎనర్జిటిక్ గా ఉంచుతుంది. పరగడుపున తాగితే కడుపులో అసౌకర్యం, గ్యాస్ సమస్య వచ్చే అవకాశం ఉంది.
కాఫీలోని కెఫిన్ కడుపులో ఆమ్లం, పిత్త ఉత్పత్తిని పెంచుతుంది. ఇది యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను పెంచుతుంది. అలాగే పెద్దప్రేగు కదలికను కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. మధ్యాహ్నం 3 గంటల తర్వాత కాఫీ తాగకూడదు. ఎందుకంటే ఇది మీ నిద్ర చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. మంచి విశ్రాంతితో కూడిన నిద్రను దూరం చేస్తుంది. నిద్రలేమి అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.