పేడపురుగు ఆకారంలో జ్యువెల్రీ పై మనసు పారేసుకుంటున్న ఫ్యాషన్ యూత్
ఫ్యాషన్ ప్రపంచంలో తమ టాలెంట్‌కు కాస్త సృజన జోడించి డిజైనర్లు సృష్టించే డిజైన్లు ఒక్కోసారి యువతకు తెగ నచ్చేస్తుంటాయి. వాటిలో పేడ పురుగు డిజైన్ ఇప్పుడు ట్రెండీగా మారింది.
కుక్కపిల్ల, సబ్బుబిళ్ల కాదేదీ కవిత కానర్హం అన్నట్టు పువ్వయినా పురుగైనా మాకు సమానమే అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు.
వానకాలంలో కనిపించే పేడపురుగుల ఆకారాన్ని ‘స్కారబ్ బీటిల్ జ్యుయెల్రీ’పేరుతో తీసుకొచ్చి యువత మనసుల్ని దోచేస్తున్నారు డిజైనర్లు. ఈ సీజన్‌లో ఇదే కొత్తగా ట్రెండ్ అవుతుంది.
బీటిల్ స్కారబ్ జ్యువెల్రీ ధరించడం ఇప్పుడు క్రేజ్‌గా మారింది. నిజానికి ఈ జ్యువెల్రీ ఈజిప్షియన్ల కాలం నాటిది. శక్తికి, రక్షణకు, అదృష్టానికి చిహ్నంగా భావించి ధరించేవారు.
మట్టిని లేదా పేడను ఉండలుగా చేస్తూ నడిచే పేడ పురుగును సూర్యుడికి గుర్తుగా ఈజిప్షియన్లు భావించేవారు. అందుకే వాళ్ల సంస్కృతిలో దానికి అంత పవిత్ర స్థానం లభించింది.
పునరుత్పత్తికి సంకేతంగా బిడ్డల కోసం ఎదురు చూసే తల్లులకు వీటిని బహుమతిగా ఇచ్చేవారట. ఆ తర్వాతి కాలంలో ఇతర దేశాలకూ ఈ సంస్కృతి పాకింది.
ప్రస్తుతం గ్లోబల్‌గా ఈ తరహా నగలు తయారవుతున్నాయి. బ్రేస్‌లెట్లు, చెవి పోగులు, ఉంగరాలు, బ్రూచ్‌ల లాంటివీ రూపొందిస్తున్నారు.
పచ్చలు, నీలాలు, కెంపులతో కలిపి అందిస్తున్నారు. వీటి చరిత్ర ఎంతో ఆసక్తిని రేకెత్తించడంతో కుర్రకారు కెవ్వుకేక పెడుతున్నారు!