కొందరు ఇళ్లల్లో రాముడు, కృష్ణుడి వేషంలో ఉన్న ఎన్టీఆర్ ఫొటోలను పూజగదిలో పెట్టుకుని ఇప్పటికీ పూజిస్తున్నారు. ఆయన తెలుగు ప్రేక్షకులకు అంత దగ్గరయ్యారు మరి.
డైలాగులు, హావభావాలు పలికించడంలో ఆయనకు తిరుగులేదు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలతో వెండితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్ తెలుగువారి గుండెల్లో అభిమాన నటుడిగా చిరస్థాయిగా నిలిచిపోయారు.
రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, రావణుడిగా ఎన్నో పాత్రల్లో ఒదిగిపోయిన ఎన్టీఆర్.. దేవుళ్లు కనిపిస్తే ఇలాగే ఉంటారు అనే రీతిలో ఆయన ఆయా పాత్రలకు ప్రాణం పోశారు
ఇంత పేరు ప్రఖ్యాతులను సంపాదించిన ఆయన తన సినీ ప్రస్థానంలో ఒక్క నారదుడు, హనుమంతుడి పాత్రలను మాత్రం వేయలేదు.
‘నారదుడు, హనుమంతుడు వంటివి కూడా ముఖ్య పాత్రలే కదా! అన్నగారూ... ఆ పాత్రల్లో మిమ్మల్ని చూసే అవకాశం ఉందా?’ అని ఎన్టీఆర్‌ను ఓ సందర్భంలో రావి కొండలరావు అడిగారట.
అప్పుడు ఎన్టీఆర్ బదులిస్తూ.. ‘నారదుడిగా ఆలోచించాను బ్రదర్. హాస్యం వచ్చేలా కాకుండా భక్తుడిగా, సర్వజ్ఞుడిగా గంభీరంగా ప్రదర్శించవచ్చు. కానీ, నా రూపం అందుకు సహకరించదేమోనని సాహసించలేదు.
నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని మనం ఒక విధమైన రూపానికి అలవాటు పడ్డాం. నా శరీరం కాస్త భారీగా ఉంటుంది. రంగారావుగారిని నారదుడి పాత్రలో ఊహించుకోగలమా? పర్సనాలిటీలు ఒప్పుకోవు
ఇక హనుమంతుడంటారా? నా ముఖం కానప్పుడు నాకెందుకా పాత్ర? మాస్క్‌తో నటించాలి. ఫిజికల్ మూవ్‌మెంట్స్ ఎక్కువ కావాలి’ అని ఎన్టీఆర్ సమాధానం చెప్పారట.