Ravi Kiran
05 July 2024
ప్రస్తుతం పగటిపూట రెండు తెలుగు రాష్ట్రాల మీదుగా వందేభారత్ సర్వీసులు పరుగులు పెడుతోన్న సంగతి తెలిసిందే. వీటికి ప్రజాదరణ పెరుగుతుండటంతో తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ స్లీపర్ రైళ్లను కేటాయించనుంది రైల్వే శాఖ.
ఆగష్టు 15 నాటికి ముందుగా 3 వందేభారత్ స్లీపర్ రైళ్లు ప్రారంభించనుంది కేంద్రం. అందులో ఒకటి తెలుగు రాష్ట్రాలకు కేటాయించారు. మొదటిగా వందేభారత్ స్లీపర్ రైలును ఢిల్లీ-ముంబై మార్గంలో ప్రవేశపెట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-పూణే మధ్య ఈ రైలు నడవనుంది. ఆ తర్వాత దశలవారీగా మరో రెండు రైళ్లను కేటాయించేలా ప్రతిపాదనలు సిద్దమయ్యాయి.
సికింద్రాబాద్-పూణేతో పాటు.. కాచిగూడ-తిరుపతి, కాచిగూడ-విశాఖపట్నం రూట్‌లలో వందేభారత్ స్లీపర్ రైళ్లను కేటాయించే అవకాశం కనిపిస్తోంది.
రెండో విడతగా ఈ రెండు మార్గాల్లో రైలును ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త వందేభారత్ స్లీపర్ రైలుకు పదహారు భోగీలు ఉండనున్నాయి. ఏసీతో పాటు నాన్ ఏసీ కోచ్‌లు కూడా ఉంటాయి.
వందేభారత్ చైర్ కారు రేట్లు భారీగా ఉండటంతో.. ఈ వందేభారత్ స్లీపర్ సర్వీసుల్లో టికెట్ ధరల్లో కొంత వెసులుబాటు ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.
మొత్తం 16 కోచ్‌లలో థర్డ్ ఏసీ 10, సెకండ్ ఏసీ 4, ఫస్ట్ ఏసీ ఒక బోగీ ఉంటాయని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి. అలాగే లగేజి కోసం మరో రెండు బోగీలు అదనంగా ఉంటాయి.
దీన్ని బట్టి చూస్తే ఆగష్టు 15 నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఒక వందేభారత్ స్లీపర్ రైలు పరుగులు పెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.