సాగుకు నీరు లేక.. నాలుగు ఎకరాల వరి పొలానికి.. తానే నిప్పు పెట్టుకున్న రైతు

×

సాగుకు నీరు లేక.. నాలుగు ఎకరాల వరి పొలానికి.. తానే నిప్పు పెట్టుకున్న రైతు

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలంలో ఒక రైతు తీవ్ర నీటి కొరతతో తన నాలుగు ఎకరాల వరి పొలానికి నిప్పు పెట్టిన విషాద ఘటన చోటుచేసుకుంది. యాతాకుల మల్లయ్య అనే రైతు కౌలుకు భూమిని తీసుకుని, అప్పులు చేసి, సాగు ఖర్చులు భరించి వరి పంట వేశాడు. పంటకు నీరు అత్యవసరమైన సమయంలో ఎల్నినో ప్రభావంతో తలెత్తిన తీవ్ర నీటి కొరత, విద్యుత్ కష్టాలు అతడి ఆశలను అడియాశలు చేశాయి. కళ్లముందే పచ్చటి వరి పొలం నెమ్మదిగా ఎండిపోతుండటం చూసి తట్టుకోలేకపోయిన మల్లయ్య, తన చేతులతోనే పొలానికి నిప్పు అంటించాడు. ఈ ఘటన రైతుల దీనస్థితికి అద్దం పడుతోంది. తన పరిస్థితి ఒక్కడిదే కాదని, తెలంగాణలో అనేక మంది రైతులు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారని మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు. రాష్ట్రంలో సాగునీటి కొరత తీవ్రంగా ఉందని, అందుకే రెండో పంట జోలికి వెళ్లవద్దని ప్రభుత్వం రైతులకు అవగాహన కల్పిస్తోంది. అయితే, ఇప్పటికే పంట వేసిన రైతుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.

Phani CH