బిగ్ బాస్ తెలుగు తొమ్మిది సీజన్లు పూర్తి చేసుకుని, ప్రస్తుతం పదవ సీజన్లోకి అడుగుపెట్టింది. అయితే, ఈ తొమ్మిది సీజన్లలో ఒక్క మహిళా కంటెస్టెంట్ కూడా టైటిల్ గెలవకపోవడంపై బిగ్ బాస్ విజేత కౌశల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. మహిళా కంటెస్టెంట్స్‌కు టాలెంట్ లేకపోవడమో, శారీరకంగా లేదా మానసికంగా బలహీనంగా ఉండటమో కారణం కాదని ఆయన స్పష్టం చేశారు. బిగ్ బాస్ కు ఉపయోగపడే కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయకపోవడం కూడా సమస్య కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన దృష్టిలో, బిగ్ బాస్ కు వస్తున్న మహిళా కంటెస్టెంట్స్ ఏ మాత్రం తక్కువ కాదని, వారంతా అద్భుతమైన ఆటగాళ్ళేనని కౌశల్ పేర్కొన్నారు. ఇక్కడ మారాల్సింది మహిళా కంటెస్టెంట్స్ కాదని, మన సమాజంలో, మన ఆలోచనా ధోరణిలో ఉన్న మైండ్‌సెట్ అని ఆయన నొక్కి చెప్పారు. దీనికి ఉదాహరణలుగా కొన్ని సంఘటనలను ప్రస్తావించారు. ఒక అబ్బాయి గట్టిగా అరిస్తే “ఫైటర్” అంటారని, అదే అమ్మాయి అరిస్తే “అగ్రెసివ్” అని అంటారని వివరించారు. అలాగే, ఒక అబ్బాయి ధైర్యంగా పోరాడితే “ఏం గేమ్ ఆడుతున్నాడు” అంటారని, అదే అమ్మాయి ఎదురు తిరిగితే “పొగరు” అంటారని కౌశల్ పేర్కొన్నారు. ఒక అబ్బాయి ఏడిస్తే “ఎమోషనల్ జర్నీ” అని భావిస్తే, అమ్మాయి ఏడిస్తే “డ్రామాలు చేస్తుంది” అని జమ కడతారని ఆయన ఉదహరించారు. కాబట్టి, మారాల్సింది అమ్మాయిలు కాదని, మనలో ఉన్న మైండ్‌సెట్, మన ఆలోచనా ధోరణి అని కౌశల్ అభిప్రాయపడ్డారు.