స్వీట్ బాక్స్ అడిగితే.. ఫ్రిజ్, TV, వాషింగ్ మెషీన్ వచ్చాయ్! ఇన్‌ఫ్లూయెన్సర్ ఇల్లు ఖాళీ!

×

స్వీట్ బాక్స్ అడిగితే.. ఫ్రిజ్, TV, వాషింగ్ మెషీన్ వచ్చాయ్! ఇన్‌ఫ్లూయెన్సర్ ఇల్లు ఖాళీ!

తమిళనాడులోని మధురైకి చెందిన ఇన్‌ఫ్లూయెన్సర్ వీరమణికి సోషల్ మీడియాలో సరదాగా చేసిన ఓ పోస్ట్ తీరని కష్టాలను తెచ్చిపెట్టింది. దీపావళి పండుగ సందర్భంగా తన ఫాలోవర్స్‌ను సరదాగా ఒక స్వీట్ బాక్స్ పంపించమని కోరాడు. అంతేకాకుండా, తన ఇంటి చిరునామా, ఫోన్ నెంబర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ఇదే అతనికి తలనొప్పిగా మారింది. కొందరు ఫాలోవర్లు నిజంగా స్వీట్లు పంపించగా, మరికొందరు ఆకతాయిలు ప్రాంక్ చేయడం మొదలుపెట్టారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఆన్‌లైన్ సైట్ల నుండి టీవీలు, ఫ్రిడ్జ్‌లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లను వీరమణి పేరు మీద క్యాష్ ఆన్ డెలివరీలో ఆర్డర్ చేశారు. ఒక టీవీ ధర లక్షా 69 వేల రూపాయల వరకు ఉంది. అరగంటలోనే పదిహేను డెలివరీలు అతని ఇంటికి చేరుకున్నాయి. డెలివరీ బాయ్స్ అందరూ వీరమణి ఇంటి ముందు క్యూ కట్టారు. ఈ పరిస్థితి చూసి షాకైన వీరమణి, తన దగ్గర అంత డబ్బు లేదని, ఇలా చేయవద్దని కోరుతూ మరో వీడియో పోస్ట్ చేశాడు. దూర ప్రాంతాల నుండి వచ్చే డెలివరీ బాయ్స్‌కు కూడా ఇబ్బందేనని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ గందరగోళం, ఆర్డర్ల ఉధృతిని భరించలేక వీరమణి చివరికి తన ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నానని ప్రకటిస్తూ మరో వీడియోను విడుదల చేశాడు. ఒక చిన్న స్వీట్ బాక్స్ కోసం చిరునామా పంచుకున్నందుకు ఎదురైన ఈ చేదు అనుభవం సోషల్ మీడియాలో సరదాగా చేసే పనుల పర్యవసానాలను కళ్లకు కట్టింది.

Phani CH