వాయు కాలుష్యం ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదంగా మారింది. ముఖ్యంగా ఊపిరితిత్తులపై కాలుష్యం తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యంతో నిండిన గాలిని పీల్చిన తర్వాత ఊపిరితిత్తులను శుభ్రం చేయడానికి రకరకాల ప్రత్యేక డ్రింక్స్ తాగడం లేదా ఆవిరి పట్టడం వంటివి చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మన ఊపిరితిత్తులకు సహజంగానే లోపలికి వెళ్లిన దుమ్ము, పొగను బయటకు పంపే సామర్థ్యం ఉంటుంది. అయితే, కాలుష్య ప్రభావం నుండి ఊపిరితిత్తులను రక్షించుకోవడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. బయటకు వెళ్లినప్పుడు ఎన్95 మాస్క్ ధరించడం చాలా ముఖ్యం. వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్నప్పుడు బయట వాకింగ్ లేదా వర్కవుట్స్ మానేయాలి. ఇంట్లో కిటికీలు మూసి ఉంచడం, వీలైతే హెపా ఫిల్టర్ ఉన్న ఎయిర్ ప్యూరిఫైర్ను ఉపయోగించడం మంచిది. ధూమపానం పూర్తిగా మానేయాలి. ఇతరులు సిగరెట్ తాగుతున్నప్పుడు ఆ పొగకు దూరంగా ఉండాలి. అలాగే, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి రోజుకు తగినంత నీరు తాగాలి. పండ్లు, కూరగాయలు, నట్స్, ముడి బియ్యం, రాగులు, జొన్నలు వంటి పౌష్టికాహారం తీసుకోవడం అవసరం. కంటి నిండా నిద్రపోవడం కూడా ఆరోగ్యానికి కీలకం. ఒకవేళ ఆస్తమా వంటి శ్వాస సమస్యలు ఉన్నవారు డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా వాడాలి. ఆగకుండా దగ్గు వచ్చినా, శ్వాస తీసుకునేటప్పుడు శబ్దం వచ్చినా, ఛాతి పట్టేసినట్లు అనిపించినా, ఊపిరి ఆడకపోయినా, గుండె దడ లేదా తీవ్రమైన నీరసం అనిపించినా వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స తీసుకోవాలి.