కోతులు వెంటపడుతుంటే.. భయంతో పరిగెడుతూ.. ఆగిపోయిన బాలుడి గుండె

×

కోతులు వెంటపడుతుంటే.. భయంతో పరిగెడుతూ.. ఆగిపోయిన బాలుడి గుండె

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కోతులు వెంటపడటంతో భయంతో పరుగులు పెట్టిన 12 ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు. నడిగూడెం మండలం వల్లపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. నిశాంత్, మణీందర్ అనే ఇద్దరు 12 ఏళ్ల బాలురు ఈత కోసం గ్రామంలోని చెరువు దగ్గరకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ఎవరూ లేని చోట, ఏడెనిమిది కోతులు ఒక్కసారిగా వారి మీదకు వచ్చాయి. కోతుల నుంచి తప్పించుకునేందుకు ఇద్దరూ భయంతో పరుగులు పెట్టగా, కోతులు వారిని వెంబడించాయి. మణీందర్ ముందు పరుగెత్తగా, నిశాంత్ వెనక్కి తిరిగి కోతులను చూస్తూ భయంతో పరుగెడుతూ కింద పడిపోయాడు. కింద పడిన నిశాంత్ స్పృహ కోల్పోయాడు. మణీందర్ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న గ్రామస్తులు గమనించి బాలుడిని వెంటనే స్థానిక వైద్యుని వద్దకు తరలించారు. వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో ఎదురైన 108 అంబులెన్స్ సిబ్బంది పరీక్షించి, నిశాంత్ అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. కోతుల భయంతో పరుగెడుతూ గుండె ఆగిపోయి బాలుడు మరణించడం వల్లపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Phani CH