వివేకా హత్య కేసు నిందితులకు 17వరకు రిమాండ్..!

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. హత్య కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న అభియోగంపై నిందితులను పులివెందుల కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. నిందితులు ఎర్రగంగిరెడ్డి, కృష్ణారెడ్డి, ప్రకాష్‌కు ఈ నెల 17 వరకు రిమాండ్ విధించింది కోర్టు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన కీలక ఆధారాలు సిట్ సేకరించింది.

మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది. మొదట గుండెపోటుతో వివేకా మృతి చెందారని కుటుంబ సభ్యులు తెలిపారు. అనంతరం ఆయన శరీరంపై గాయాలు ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి, మార్చురీకి తరలించారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో వివేకాది హత్య అని తేలింది. రాజకీయంగా రచ్చ మొదలైంది. దీంతో ప్రభుత్వం ఈ హత్య కేసు విచారణకు సిట్‌ను నియమించింది.

వివేకా మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించే క్రమంలో రక్త నమూనాలు చెరిపివేయడంతో పాటు కీలక సాక్ష్యాలను ఎర్రగంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డితో పాటు వంట మనిషి కుమారుడు ప్రకాష్‌లు తారుమారు చేశారన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. కేసు తీవ్రత దృష్ట్యా సిట్ బృందం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *