తండ్రి ఎమ్మెల్యే.. నడిరోడ్డుపై కొడుకు పుట్టినరోజు వేడుక.. 3 గంటలు ట్రాఫిక్ జామ్

YCP MLA son birthday celebrations on the main road heavy traffic jam, తండ్రి ఎమ్మెల్యే.. నడిరోడ్డుపై కొడుకు పుట్టినరోజు వేడుక.. 3 గంటలు ట్రాఫిక్ జామ్

తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొడుకు చేసిన నిర్వాకంతో ఆ ఊరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ప్రాంతం అంబాజీపేట నాలుగురోడ్ల సెంటర్‌లో దాదాపు 3 గంటలపాటు ట్రాఫిక్ జామ్ కావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. కనీసం ద్విచక్రవాహనాలు సైతం ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం స్ధానిక ఎమ్మెల్యే కుమారుడు పుట్టిన రోజు వేడుకలు. వివారాల్లోకి వెళితే.. పి. గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కుమారుడు వికాస్ తన జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. అందులో ఎలాంటి తప్పు లేదు. అయితే ఆ వేడుకలు నడిరోడ్డుమీద ఏర్పాటు చేయడమే అసలు సమస్యకు కారణం.

ఎవరైనా పుట్టినరోజును తమ ఇళ్లవద్దగానీ లేక ఏదైనా ఫంక్షన్ హాల్లోగానీ జరుపుతారు. కానీ ఈ విధంగా మెయిన్ రోడ్డుమీద జరపడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అసలే అది నాలుగు రోడ్ల సెంటర్ కావడంతో నాలుగువైపుల నుంచి వచ్చే వాహనాలు ఎటూ కదలలేని పరిస్థితి తలెత్తింది. రాజకీయ పలుకుబడి ఉందికదా అని ఈ విధంగా ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించడంపై స్ధానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఒక్క వాహనం ముందుకు కదలకపోవడంతో వాహనదారులు తీవ్రమైన అవస్థకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పోలీసులు మాత్రం ప్రేక్షకపాత్ర వహించడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *