Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

రెండు నెలల ముందే జగన్ క్లారిటీ.. పెద్దలసభకు వీరేనా?

jagan selected rajyasabha candidates, రెండు నెలల ముందే జగన్ క్లారిటీ.. పెద్దలసభకు వీరేనా?

రాజ్యసభ ఎన్నికలకు ముందస్తు వ్యూహంతో యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తున్నారు ఏపీలో అధికార పార్టీ వైసీపీ అధినేత జగన్. రెండు నెలల ముందే పెద్దల సభకు పంపాల్సిన నలుగురిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఖరారు చేసినట్లు అమరావతి వర్గాలు చెప్పుకుంటున్నాయి.

రాజ్యసభకు ప్రతీ రెండేళ్ళకోసారి ఎన్నికలు జరుగుతాయి. ఏపీలో నుంచి ఈసారి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయబోతున్నారు. మొన్నటి ఎన్నికల తర్వాత మారిన లెక్కల ప్రకారం వైసీపీకే ఆ నాలుగు రాజ్యసభ సీట్లు దక్కే అవకాశం వుంది.

మొత్తం 175 మంది సభ్యులున్న ఏపీ అసెంబ్లీలో వైసీపీ సంఖ్యాబలం 151 కాగా.. టీడీపీకి చెందిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అధికారికంగా చేరకపోయినా, వైసీపీతోనే సన్నిహితంగా వుంటున్నారు.

ఈ నేపథ్యంలో 152 మంది బలంతో ఫిబ్రవరిలో జరగబోయే రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికల్లో వైసీపీ నాలుగు స్థానాలను గెలుచుకోవడం ఖాయం. అయితే.. రాజ్యసభ రేసులో చాలా మందే వుండడంతో నలుగురిని ఎంపిక చేయడం జగన్‌కు సవాలేనని పలువురు భావించారు. కానీ, ఈ నలుగురిపై జగన్ ఇప్పటికే ఓ క్లారిటీకి వచ్చేశారని పార్టీ వర్గాల్లో చర్చ జరగుతోంది.

వీరేనా ఆ నలుగురు?

అయోధ్య రామిరెడ్డి పేరు అందరి కంటే ముందుగా వినిపిస్తోంది, రాంకీ అధినేతగా అందరికీ సుపరిచితులైన అయోధ్య రామిరెడ్డి 2014 ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీచేసి మోదుగుల చేతిలో పరాజయం పాలయ్యారు. ఆయనకు రాజ్యసభ సీటును జగన్ ఖరారు చేసినట్లు చర్చ జరుగుతోంది. ఈయన మంగళగిరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్ళ రామకృష్ణారెడ్డికి సోదరుడు.

వైవీ సుబ్బారెడ్డి.. ఆయన జగన్ బంధువుగా అందరికి తెలిసిన వారే. ఇటీవల ఈయన్ని టిటిడి ట్రస్టు బోర్డు ఛైర్మెన్‌గా చేశారు జగన్. అయితే మొన్నటి ఎన్నికల్లో లోక్‌సభకు పోటీచేయాలనుకున్న సుబ్బారెడ్డిని జగన్ నిలువరించి, భవిష్యత్తులో మరిన్ని అవకాశాలుంటాయని అప్పట్లో బుజ్జగించారు. దాంతో ఇపుడు ఆయన్ని రాజ్యసభకు పంపడం ఖాయమని చెప్పుకుంటున్నారు.

ఇక ఇటీవల పార్టీలో చేరిన నెల్లూరు నాయకుడు బీద మస్తాన్ రావుకు మరో సీటు కన్‌ఫర్మ్ అన్న చర్చ జోరుగా జరుగుతోంది. బీద మస్తాన్ రావు.. వైసీపీలో కీలక నేత విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితుడని పేరుంది. గతంలో పార్టీలు వేరైనా వీరిద్దరి మధ్య మంచి దోస్తీ వుండేదని, వీరిద్దరిది.. వారి యుక్తవయసు నాటి స్నేహమని తెలుస్తోంది. దాంతో విజయసాయి రెడ్డి సలహాతోనే జగన్ మస్తాన్ రావును రాజ్యసభకు పంపుతారని సమాచారం. ఈ చర్య నెల్లూరులో ఓ సామాజిక వర్గంపై పూర్తిస్థాయి పట్టుకు ఉపయోగపడుతుందంటున్నారు.

ఇక నాలుగో సీటు.. గోకరాజు రంగరాజు లేదా గంగరాజుకు అంటున్నారు. గోకరాజు గంగరాజు గతంలో బిజెపి తరపున నర్సాపురం నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. ఇటీవల గంగరాజు సోదరులతోపాటు ఆయన తనయుడు రంగరాజు వైసీపీలో చేరారు. గంగరాజు మాత్రం ఇంకా బిజెపిలోనే వున్నారు. ఈ నేపథ్యంలో గంగరాజుకు రాజ్యసభ సీటును ఆఫర్ చేసి మరీ పార్టీలోకి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. గంగరాజు పార్టీలో చేరితే ఆయనకు, లేదా ఆయన తనయుడు రంగరాజుకు రాజ్యసభ సీటిస్తారని వైసీపీ శ్రేణులు చెప్పుకుంటున్నాయి.

మొత్తానికి రెండునెలల ముందే రాజ్యసభకు వెళ్ళే నలుగురి పేర్లపై వైసీపీ అధినేత జగన్ క్లారిటీతో వున్నారని, ఏదైనా ఊహించనిది జరిగితే తప్ప ఈ నలుగురే వైసీపీ తరపున రాజ్యసభ మెట్లెక్కుతారని అంటున్నారు.