ప్యారిస్ ఒప్పందం.. భారత్, చైనాలపై ట్రంప్ మండిపాటు

ప్యారిస్ లో కుదిరిన క్లైమేట్ ఒప్పందం నుంచి వైదొలగాలని తాము నిర్ణయం తీసుకోవడానికి భారత్, చైనా దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ ఒప్పందం సహేతుకం కాదని, నిజానికి ఆ ‘ డీల్ ‘ నుంచి ప్రయోజనం పొందుతున్న ఇండియా, చైనా వంటి దేశాలకు తాము భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం నుంచి తమ దేశం తప్పుకుంటోందని గత ఏడాది జూన్ లో ఆయన ప్రకటించిన సంగతి […]

ప్యారిస్ ఒప్పందం.. భారత్, చైనాలపై ట్రంప్ మండిపాటు
Pardhasaradhi Peri

|

Nov 13, 2019 | 12:50 PM

ప్యారిస్ లో కుదిరిన క్లైమేట్ ఒప్పందం నుంచి వైదొలగాలని తాము నిర్ణయం తీసుకోవడానికి భారత్, చైనా దేశాలే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. ఆ ఒప్పందం సహేతుకం కాదని, నిజానికి ఆ ‘ డీల్ ‘ నుంచి ప్రయోజనం పొందుతున్న ఇండియా, చైనా వంటి దేశాలకు తాము భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తోందని ఆయన అన్నారు. ఈ ఒప్పందం నుంచి తమ దేశం తప్పుకుంటోందని గత ఏడాది జూన్ లో ఆయన ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మంగళవారం న్యూయార్క్ లోని ఎకనమిక్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడిన ట్రంప్ మళ్ళీ అలాంటి వ్యాఖ్యలే చేశారు. ప్యారిస్ అగ్రిమెంట్ కారణంగా అమెరికా కోట్లాది డాలర్లను నష్టపోవాల్సివస్తోందని, అలాగే ఎన్నో ఉద్యోగావకాశాలను కోల్పోతోందని, అంతేగాక ఆయిల్, గ్యాస్, బొగ్గు వంటి పరిశ్రమలపై అది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఇండియా, చైనా వంటి దేశాలకు మేం సొమ్ము చెల్లించాల్సి వస్తోంది.. టెక్నాలజీ ప్రకారంగానే కాక, క్లైమేట్ ఛేంజ్ పై ఈ దేశాలు చేసే పనులకు మేం డబ్బు చెల్లించవలసి రావడం విడ్డూరం ‘ అన్నారాయన. అందుకే ఆ ఒప్పందం నుంచి వైదొలగామన్నారు. ఆ అగ్రిమెంట్ ఆర్థికంగా అసమంజసమైనదని, అమెరికన్ ఉద్యోగాల్లో కోత పడుతోందని, పైగా అది ‘ విదేశీ కాలుష్యకారకుల ‘ కొమ్ము కాస్తోందని ట్రంప్ విరుచుకపడ్డారు. వర్ధమాన దేశమని ఇండియా చెప్పుకుంటోంది.. అసలు మనదీ వర్ధమాన దేశమే అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 2015 డిసెంబరు 15 న ప్యారిస్ లో కుదిరిన ఒప్పందాన్ని 196 దేశాలు ఆమోదించాయి. ప్రపంచ వ్యాప్త వాతావరణ పరిరక్షణకు కృషి చేయాలని , కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవాలని ఆ అగ్రిమెంట్ లో నిర్దేశించారు. దీని ప్రకారం అమెరికా లాంటి అభివృధ్ది చెందిన దేశాలు.. వర్ధమాన దేశాలకు క్లైమేట్ చేంజ్ పై అవి చేసే ప్రయత్నాలకు సొమ్ము చెల్లించవలసి ఉంటుంది. అయితే దీనిపై ట్రంప్ సెటైర్లు వేస్తూ.. ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలు కాలుష్య నివారణకు ఎలాంటి చర్యలూ తీసుకోవడంలేదని, తమ కర్మాగారాలను శుద్ది చేసుకోవడంలేదని, పైగా తమ చెత్తనంతా సముద్రంలో పారవేస్తున్నాయని, అది లాస్ ఏంజిలిస్ లో తేలుతోందని అన్నారు. అసలు ప్యారిస్ అగ్రిమెంట్ ఏకపక్షంగా ఉందని ఆరోపించారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu