Mongolian PM Resign: పాలకుల పదవికి గండం తెస్తున్న కోవిడ్..వైరస్‌ని కట్టడి చేయలేక పదవికి రాజీనామా చేసిన దేశ ప్రధాని

కరోనా వ్యాప్తి ఆ దేశ ప్రధానికి చుక్కలు చూపించింది. తన పదవిని తానే స్వయంగా వదులుకునేలా చేసింది. కంటికి కనిపించని చిన్న క్రిమి ప్రజలనే కాదు పాలకులను కూడా వణికిస్తుందని మరోసారి రుజువుచేసింది....

  • Surya Kala
  • Publish Date - 12:08 pm, Fri, 22 January 21
Mongolian PM Resign: పాలకుల పదవికి గండం తెస్తున్న కోవిడ్..వైరస్‌ని కట్టడి చేయలేక పదవికి రాజీనామా చేసిన దేశ ప్రధాని

Mongolian PM Resign:ఏడాది క్రితం చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఓ వైపు ప్రజల ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతుంది. మరోవైపు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను కలుగజేసింది. ఈ వైరస్ నివారణ కోసం పెద్ద, చిన్న దేశాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే కోట్ల మంది కరోనా వైరస్ బాధితులు కాగా… లక్షలాది మంది మృతువాత పడ్డారు. ఈ పరిస్థితిని గట్టెకెందుకు ప్రపంచదేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కొని దేశాలు టీకా ప్రయోగాలను మొదలు పెట్టాయి. మన దేశంలో కూడా తొలిదశ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించింది.

అయితే ఈ వైరస్ ను నియంత్రించడం నా వల్ల కాదంటూ ఓ దేశ ప్రధాని చేతులెత్తేసి.. ఏకంగా తన పదవికే రాజీనామా చేశారు. ఈ ఘటన మంగోలియా దేశంలో చోటు చేసుకుంది. కోవిడ్ 19 ప్రారంభ దశలో ఆ దేశం కట్టడి కోసం పటిష్ట చర్యలు చేపట్టింది. అయితే ఆ వైరస్ నివారణ మాత్రం సాధ్యం కాలేదు.. తాజాగా అక్కడ రెండో దశలో వ్యాప్తి మొదలైంది. ముఖ్యంగా మంగోలియా రాజధాని ఉలాన్ బాతర్‌లో కరోనా తీవ్రంగా వ్యాపిస్తోంది. భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతూ మళ్ళీ కలకలం రేపుతోంది. దీంతో ఆ దేశ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికుతోంది. తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకోలేని ప్రధానమంత్రి ఖురేసుఖ్ ఉఖ్నా తన పదవికి రాజీనామా చేశారు. ఎందుకంటే కరోనా రోగి, ఓ చిన్నారికి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. బాధితులకు కనీస నివాసం కల్పించకపోవడంపై ఆ దేశంలో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలకు తట్టుకోలేక వాటికి బాధ్యత వహిస్తూ ఖురేసుఖ్ ఉఖ్నా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ విమర్శలతో పాటు నిరసనలు వచ్చాయి. ఈ విధంగా కరోనా వ్యాప్తి ఆ దేశ ప్రధానికి చుక్కలు చూపించింది. తన పదవిని తానే స్వయంగా వదులుకునేలా చేసింది. కంటికి కనిపించని చిన్న క్రిమి ప్రజలనే కాదు పాలకులను కూడా వణికిస్తుందని మరోసారి రుజువుచేసింది.

Also Read: వయసు, అనారోగ్యం దృష్ట్యా వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించడానికి మహా సర్కార్ అంగీకారం