ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం…60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు… అత్యున్నత పదవి నుంచి వైదొలిగిన రౌల్‌ కాస్ట్రో

ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం...60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు... అత్యున్నత పదవి నుంచి వైదొలిగిన రౌల్‌ కాస్ట్రో
Raul Castro

Raul Castro: ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న కమ్యూనిస్టు దేశం 'క్యూబా'. ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్యూబా అత్యున్నత పదవి నుంచి ...

Subhash Goud

| Edited By: Ram Naramaneni

Apr 18, 2021 | 8:23 AM

Raul Castro: ప్రపంచ దేశాల్లో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న కమ్యూనిస్టు దేశం ‘క్యూబా’. ఆ దేశ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. క్యూబా అత్యున్నత పదవి నుంచి రౌల్‌ కాస్ట్రో వైదొలిగారు. క్యూబా కమ్యూనిస్టు పార్టీ ప్రథమ కార్యదర్శి పదవి నుంచి వైదొలుగుతున్నట్లు రౌల్ క్యాస్ట్రో ప్రకటించారు. ప్రస్తుతం ఆయన వయసు 89 ఏళ్లు. దీంతో క్యాస్ట్రోల 60 ఏళ్ల కుటుంబ పాలనకు ముగింపు పడింది. క్యూబా కమ్యూనిస్టు పార్టీలో ‘ఫస్ట్ సెక్రెటరీ’ స్థానంలో ఉన్న వ్యక్తికి దేశ పాలన, పార్టీపై సర్వ అధికారాలు ఉంటాయి. ఇది దేశంలో అత్యంత శక్తివంతమైన స్థానం కావడం విశేషం. ప్రస్తుతం రౌల్ క్యాస్ట్రో క్యూబా కమ్యూనిస్టు పార్టీకి ఫస్ట్ సెక్రటరీ పదవిలో కొనసాగుతున్నారు. ప్రస్తుత క్యూబా అధ్యక్షుడు, 60 ఏళ్ల మిగ్యుయెల్ డియాజ్ కానెల్‌ పార్టీ తదుపరి ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర

కాగా, క్యూబా దేశ రాజకీయాల్లో, పాలనపై ఫిడెల్‌ క్యాస్ట్రో, అతని సోదరుడు రౌల్ క్యాస్ట్రో చెరిగిపోని ముద్ర వేశారు. వీరిద్దరూ దేశాన్ని సుమారు 50 ఏళ్ల పాటు పాలించారు. 1959 నుంచి 2006 వరకు దాదాపు ఐదు దశాబ్దాల పాటు పాలించారు. 60 ఏళ్ల వరకు పార్టీపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ప్రస్తుతం దేశ అధ్యక్షుడిగా ఉన్న డయాజ్ కానెల్.. క్యాస్ట్రో సోదరుల తరువాత శక్తివంతమైన క్యూబా కమ్యూనిస్టు పార్టీ (PCC)కి మూడవ ‘ఫస్ట్ సెక్రటరీ’ హోదాను పొందనున్నారు.

క్యూబా దేశ పాలన వ్యవహారాల్లో పార్టీ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. దేశానికి అధ్యక్ష స్థానంలో ఉన్న వ్యక్తి కంటే కమ్యూనిస్టు పార్టీలోని ఫస్ట్‌ సెక్రటరీకే ఎక్కువ విలువ ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉన్న క్యూబా కమ్యూనిస్టు పార్టీకి రౌల్ క్యాస్ట్రో ఫస్ట్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. అయితే రిపబ్లిక్‌ ఆఫ్‌ క్యూబా మార్క్సిస్ట్‌ -లెనినిస్ట్‌ భావాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న సోషలిస్టు దేశం. 1976 రాజ్యాంగం ప్రకారం.. క్యూబా సోషలిస్టు రిపబ్లిక్‌గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. 1992లో రాజ్యాంగ సవరణలు జరిగాయి. అయితే రాజ్యాంగం ప్రకారం.. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్‌ క్యూబా దేశం, సమాజాన్ని నడిపించే అత్యున్నత శక్తిగా పేర్కొంది.

క్యూబా మొదటి నుంచి సోషలిస్టు దేశంగా …

కాగా, రౌల్ క్యాస్ట్రో క్యూబా రాజకీయ పోరాటంలో, సైద్ధాంతిక పోరాటంలో భాగంగా ఉన్నారు. అంతమాత్రాన ఆయన పార్టీ నాయకత్వం నుంచి వైదొలగడం వల్ల కమ్యూనిస్ట్ పార్టీ శైలిలో ఊహించని మార్పులు ఉండకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. క్యూబా మొదటి నుంచి సోషలిస్టు దేశంగా ఉంది. అయితే ఆ దేశంలో 2019లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. ఇందులో సోషలిజం పట్ల క్యూబా నిబద్ధత తిరుగులేనిది అని పేర్కొన్నారు. మామూలుగా క్యూబా ప్రజలు దేశ రాజకీయాలను పెద్దగా పట్టించుకోరు. కానీ ప్రస్తుతం దేశం ఎన్నో సమస్యల ఉచ్చులో చిక్కుకుంది.

తీవ్రమైన ఆర్థిక సంక్షోభం

క్యూబాలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. పాలనా పరమైన వైఫల్యాలు, ట్రంప్ హయాంలో క్యూబాపై పెరిగిన ఆంక్షలు, కరోనా వైరస్ వల్ల పర్యాటకం దెబ్బతినడంతో దేశ ఎకానమీ (ఆర్థిక వ్యవస్థ) 11 శాతం తగ్గింది. ఇది 1993 తరువాత అత్యంత ఘోరమైన క్షీణత కావడం విశేషం. గతంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల్లో అమెరికా డాలర్లకు మార్చుకోవడానికి వీలయ్యే కన్వర్టబుల్ పెసో(దేశ కరెన్సీ)ను తొలగించాలని నిర్ణయించారు. దీంతో తక్కువ విలువైన అధికారిక పెసో చలామణిలోకి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వం జీతాలు పెంచినా, ధరల ద్రవ్యోల్బణం నియంత్రణలోకి రాలేదు. ప్రస్తుత పార్టీ సమావేశాల్లో ఈ అంశాలను సమీక్షిస్తామని క్యూబా కమ్యూనిస్టు పార్టీ తెలిపింది.

అయితే క్యూబాలో 2018లో మొబైల్‌ ఫోన్లు, ఇంటర్నెట్‌ వాడకం ప్రారంభమైంది. ఆ తర్వాత తమ అభిప్రాయాలను ప్రజలు స్వేచ్ఛగా వెల్లడించే అవకాశం దక్కింది. ఫలితంగా కమ్యూనిస్టు పార్టీ రాజకీయ, సైద్ధాంతిక విధ్వంసాన్ని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో కాస్ట్రో అత్యున్నత పదవి నుంచి వైదొలగడం ప్రాధాన్యం సంతరించుకుంది. పదవీ విరమణ చేసిన తరువాత తన మనవళ్లు, మనవరాళ్లతో ఎక్కువ సమయం గడుపుతానని రౌల్ క్యాస్ట్రో చెప్పారు. కానీ ఆయన తెర వెనుక నుంచే పాలన వ్యవహారాలను పర్యవేక్షించే అవకాశం ఉందని మరికొంత మంది భావిస్తున్నారు.

ప్రథమ కార్యదర్శిదే పెత్తనం.. క్యూబాలో అధ్యక్షుడి కంటే.. ప్రథమ కార్యదర్శిదే ఆధిపత్యం కొనసాగుతుంది. ప్రథమ కార్యదర్శికి పొలిట్ బ్యూరో, సెక్రటేరియట్ కు నేతృత్వం వహించి క్యూబన్ ప్రభుత్వంలో అత్యున్నత అధికారిగా కొనసాగుతారు. క్యూబా అధ్యక్షుడిని నేషనల్ అసెంబ్లీ ఎన్నుకుంటుంది. అధ్యక్షుడి పదవీకాలం ఐదేళ్లు. అధ్యక్షుడిగా ఎన్ని పర్యాయాలైన సేవలందించవచ్చు.

ఇవీ చదవండి: America Key Decision: మే 1నుంచి అమెరికా సేనల ఉపసంహరణ షురూ.. రెండు దశాబ్ధాలలో అగ్రరాజ్యం ఏంసాధించిందంటే?

US: ఫెడెక్స్ కాల్పుల ఘటనలో.. నలుగురు సిక్కులు సహా 8 మంది మృతి.. స్పందించిన భారత్

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu