
హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) సమీపంలో అమెరికా సైన్యానికి చెందిన అత్యంత శక్తివంతమైన ‘AH-64 అపాచీ’ (Apache) హెలికాప్టర్ కూలిపోవడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది. హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సమయంలో అందులో ఉన్న ఇద్దరు పైలట్లను సైన్యం సురక్షితంగా రక్షించింది. అయితే, ఈ హెలికాప్టర్ ఇరాన్ దాడుల వల్ల కూలిపోయిందా? లేక సాంకేతిక లోపం కారణమా? అనేది ఇంకా స్పష్టం కాలేదు. ‘ది న్యూయార్క్ టైమ్స్’ కథనం ప్రకారం, ఇద్దరు ఉన్నతాధికారులు ఈ ప్రమాదాన్ని ధృవీకరించినప్పటికీ, ట్రంప్ ప్రభుత్వం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
మిడిల్ ఈస్ట్‌లో ఇజ్రాయెల్, ఇరాన్‌ల మధ్య దాడుల పర్వం ముగిసి, కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తున్నప్పటికీ.. పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో అమెరికా హెలికాప్టర్ కూలిపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్ ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకు అమెరికా సైన్యం అపాచీ హెలికాప్టర్లు, MQ-9 రీపర్ డ్రోన్‌లు, F/A-18, F-35 యుద్ధ విమానాలను పెద్ద ఎత్తున మోహరించింది. ఇప్పటివరకు ఇరాన్ దాదాపు 30 రీపర్ డ్రోన్‌లను, అలాగే ఏప్రిల్‌లో ఒక F-15A స్ట్రైక్ ఈగిల్ విమానాన్ని కూడా కూల్చివేసింది. కానీ, ఈ ఘర్షణల్లో ఒక అపాచీ హెలికాప్టర్ కూలిపోవడం ఇదే మొదటిసారి.
ప్రాజెక్ట్ ఫ్రీడమ్ – అపాచీ ప్రత్యేకతలు:
వాణిజ్య నౌకల రక్షణ కోసం యూఎస్ నేవీ ప్రారంభించిన ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’లో భాగంగా.. మే 4న యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ హోర్ముజ్ సమీపంలో ఈ అపాచీ హెలికాప్టర్‌లోనే ప్రయాణించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాణాంతకమైన యుద్ధ హెలికాప్టర్‌గా అపాచీకి పేరుంది. ఇది లేజర్ గైడెడ్ హెల్‌ఫైర్ క్షిపణులతో శత్రువుల డ్రోన్‌లను, చిన్న పడవ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టగలదు. అందుకే ఇరాన్ సరిహద్దులకు సమీపంలో అమెరికా వీటిని ఎక్కువగా వాడుతోంది. ప్రస్తుతం ఈ ప్రమాదం వెనుక శత్రుదేశాల హస్తం ఉందా అనే కోణంలో యూఎస్ సెంట్రల్ కమాండ్ రహస్యంగా విచారణ జరుపుతోంది. దీనిపై అమెరికా రక్షణ శాఖ ఇచ్చే అధికారిక నివేదిక కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
Adm. Brad Cooper, CENTCOM commander, flew over regional waters in and near the Strait of Hormuz in an AH-64 Apache helicopter, May 3, on the eve of U.S. military support for Project Freedom. He interacted with U.S. Army Soldiers after visiting with Sailors and Marines on Saturday… pic.twitter.com/NEc9YCFBPB
— U.S. Central Command (@CENTCOM) May 4, 2026
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..