కరోనాతో భర్త మరణం తట్టుకోలేక భార్య ఆత్మహత్య

హైదరాబాద్ మహానగరంలోని సైనిక్‌పురిలో విషాదం చోటుచేసుకుంది. భర్త కరోనా బారినపడి మృతి చెందడం చూసి తట్టుకోలేక.. భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

  • Balaraju Goud
  • Publish Date - 7:13 am, Fri, 23 October 20

హైదరాబాద్ మహానగరంలోని సైనిక్‌పురిలో విషాదం చోటుచేసుకుంది. భర్త కరోనా బారినపడి మృతి చెందడం చూసి తట్టుకోలేక.. భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర సంఘటన సైనిక్‌పురి అంబేడ్కర్‌నగర్‌లో గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన తడకమల్ల వెంకటేష్‌ (56), ధనలక్ష్మి (55) నాలుగేళ్ల క్రితం నగరానికి వచ్చి అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. వెంకటేష్‌ కూలీ పని చేస్తుండగా భార్య సూపర్‌ మార్కెట్‌లో పని చేస్తుంది. వీరికి పిల్లలు లేరు. నాలుగు రోజుల క్రితం వెంకటేష్‌ ఆరోగ్యం బాగోలేక కరోనా పరీక్ష చేయించుకున్నాడు. పాజిటివ్‌ రావడంతో ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్నాడు. గురువారం మధ్యాహ్నం ఆరోగ్యం క్షీణించడంతో అతడు ఇంట్లోనే కన్నుమూశాడు. భార్య సాయంత్రం 4 గంటలకు డ్యూటీ నుంచి ఇంటికి వచ్చింది. అప్పటికే భర్త మృతి చెందినట్లు గుర్తించి తీవ్ర మనోవేదనకు గురైంది. మూడో అంతస్తుకు వెళ్లి పైనుంచి దూకి ధనలక్ష్మీ కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనకు సంబంధించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.