కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న జనసేనాని..!

Will Pawan Kalyan work with Congress in future in Telangana?, కాంగ్రెస్‌కు దగ్గరవుతున్న జనసేనాని..!

తెలంగాణలో కాంగ్రెస్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ దగ్గరవుతున్నారా..? ఇప్పుడు ఈ ప్రశ్న రాజకీయాల్లో హాట్‌ హాట్‌గా నడుస్తోంది. ఇటీవల పవన్ కల్యాణ్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు కలిశారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా తాము చేసే పోరాటానికి మద్దతు పలకాలని ఈ సందర్భంగా వీహెచ్, పవన్‌కు విన్నవించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన పవన్.. యురేనియం తవ్వకాలపై గళం ఉమ్మడి పోరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.

ఇక పవన్‌ను వీహెచ్ కలిసిన మరుసటి రోజే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి యురేనియం తవ్వకాలపై ఓ ట్వీట్ చేశారు. మన రాష్ట్రానికి ఊపిరి లాంటి నల్లమలను కాపాడుకుందాం అని ట్వీట్ చేసిన ఆయన.. దీనికి పవన్ కల్యాణ్‌ను కూడా ట్యాగ్ చేశారు. దీంతో తెలంగాణలో కాంగ్రెస్‌కు పవన్ దగ్గరవుతున్నాడని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే గత ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపిన పవన్ కల్యాణ్.. కాంగ్రెస్‌పై మాత్రం ఎప్పటి నుంచో నిప్పులు కక్కుతూ వస్తున్నారు. తన సోదరుడు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ.. తనకు ఆ పార్టీ భావజాలలు నచ్చవని ఆయన పలు సందర్భాలలో తెలిపారు. అంతేకాదు జనసేన పార్టీని స్థాపించినప్పుడు కూడా కాంగ్రెస్ హఠావో- దేశ్ బచావో అనే పిలుపును ఇచ్చారు పవన్. ఇక గత ఎన్నికల సమయంలో బీజేపీ, టీడీపీకి మద్దతిచ్చిన పవన్.. ఇప్పుడు ఆ రెండు పార్టీలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక ఏపీలో జనసేన పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండగా.. తెలంగాణలో అదృష్టం పరీక్షించుకునేందుకు ఆయన తపనపడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌తో కలిసి జగన్ పనిచేయబోతున్నారన్నది కొందరి వాదన.

ఇదిలా ఉంటే ప్రజా సమస్యలపై పార్టీలకతీతంగా పోటీ చేస్తానని మొదటి నుంచే చెబుతూ వస్తున్నారు పవన్ కల్యాణ్. ఈ క్రమంలోనే ఇప్పుడు తెలంగాణలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ చేస్తున్న ఉమ్మడి పోరుకు మాత్రమే పవన్ మద్దతు ఇచ్చారని కొందరు అంటున్నారు. అంతేకానీ కాంగ్రెస్‌తో కలిసి పనిచేయరని వారు అభిప్రాయపడుతున్నారు. మరి జనసేనాని నెక్ట్స్ ప్లాన్స్ ఏంటి..? తెలంగాణలో పవన్ తన పార్టీని విస్తరిస్తారా..? భవిష్యత్‌లో కాంగ్రెస్‌తో కలిసి పవన్ పనిచేసే అవకాశాలున్నాయా..? ఇలాంటి సమస్యలన్నింటికి కాలమే సమాధానం చెప్పాలి మరి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *