వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య

ప్రియుడి మోజులో పడిన ఒక మహిళ తాళికట్టిన భర్తనే కడతేర్చింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపిన భార్య
Follow us

|

Updated on: Sep 24, 2020 | 1:43 PM

ప్రియుడి మోజులో పడిన ఒక మహిళ తాళికట్టిన భర్తనే కడతేర్చింది. వరంగల్‌ గ్రామీణ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. గేటుపల్లితండాకు చెందిన దర్యావత్‌సింగ్‌ (42) హన్మకొండ ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. మహబూబాబాద్‌ జిల్లా తాళ్లపూసపల్లికి చెందిన జ్యోతితో ఇతనికి ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. నెక్కొండలో నివాసం ఉంటున్న వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సజావుగా కాపురం సాగుతుందనుకున్నంతలో ఓ కుదుపు మొదలైంది.

అప్పల్‌రావుపేట గ్రామానికి చెందిన సాంబరాజు అనే యువకుడితో జ్యోతి పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు మొదలయ్యాయి. కరోనా కారణంగా దర్యావత్‌సింగ్‌ ఈ మధ్య ఇంట్లోనే ఉంటున్నాడు. దీంతో ప్రియుణ్ని కలవడానికి అడ్డుగా ఉన్నాడనే ఉద్దేశంతో అతడిని వదిలించుకోవాలనుకుంది. ఇందుకోసం ప్రియుడు సాంబరాజుతో కలిసి పక్కా ఫ్లాన్ వేసింది. అనుకున్నదే తడువుగా ఈనెల 14న భర్త మద్యం తాగి ఉన్నాడని, అతన్ని చంపడానికి ఇదే అనుకూల సమయమని జ్యోతి సాంబరాజుకు ఫోన్‌చేసి పిలిపించింది. దీంతో అతడు ట్రాలీ ఆటోతో నెక్కొండ చేరుకున్నాడు. ఇద్దరూ కలిసి తాడుతో దర్యావత్‌సింగ్‌ గొంతు బిగించి హతమార్చారు. మృతదేహాన్ని ఆటోలో తన పత్తి చేనుకు తీసుకెళ్లి పెట్రోలు పోసి నిప్పంటించి సజీవదహనం చేశారు. ఏమి తెలియదన్నట్లు యధావిధిగా ఎవరి ఇళ్లకు వారు చేరుకున్నారు.

అయితే, మర్నాడు పత్తి చేనుకు వెళ్లి చూడగా శవం సగమే కాలి ఉండటం కనిపింది. దీంతో ఆ రాత్రి మృతదేహాన్ని పూర్తిగా కాల్చేసి బూడిద తీసుకెళ్లి చెరువులో పారబోశారు. ఇదిలావుంటే, దర్యావత్‌సింగ్‌ కనిపించకపోవడంతో అతడి అన్న వీరన్నకు అనుమానం వచ్చింది. దీంతో ఈ నెల 21న నెక్కొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు జ్యోతిపై అనుమానం వచ్చి ఆమె కాల్‌డేటా చెక్ చేయడంతో అసలు భాగోతం బయటకు వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు అంగీకరించింది. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.