ఈ- సిగరెట్ల నిషేదం సరే.. మరి సాధారణ సిగరెట్ల సంగతి ఏంటీ?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సిగరెట్లపై నిషేదం విధిస్తూ ప్రకటన చేసింది. పొగలు కక్కే సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ సిగరెట్లతోనే అనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కోట్లామంది అనారోగ్య కారణానికి కారణమవుతున్న సాధారణ సిగరెట్ల సంగతి ఏమిటనే ప్రశ్నవస్తోంది. పొగానును వివిధ రకాలుగా ప్రొసెస్ చేసి వివిధ రూపాల్లో చుట్టలుగానూ, సిగరెట్లు గాను తయారు […]

ఈ- సిగరెట్ల నిషేదం సరే.. మరి సాధారణ సిగరెట్ల సంగతి ఏంటీ?
Follow us

| Edited By:

Updated on: Sep 20, 2019 | 4:26 PM

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఈ సిగరెట్లపై నిషేదం విధిస్తూ ప్రకటన చేసింది. పొగలు కక్కే సాధారణ సిగరెట్లతో పోల్చితే ఈ సిగరెట్లతోనే అనారోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయని కేంద్రం గుర్తించి ఈ నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేదిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. అయితే కోట్లామంది అనారోగ్య కారణానికి కారణమవుతున్న సాధారణ సిగరెట్ల సంగతి ఏమిటనే ప్రశ్నవస్తోంది.

పొగానును వివిధ రకాలుగా ప్రొసెస్ చేసి వివిధ రూపాల్లో చుట్టలుగానూ, సిగరెట్లు గాను తయారు చేయడం ఎంతో కాలంగా వస్తున్నదే. అయితే ఎలక్ట్రానిక్ సిగరెట్లు అనేవి కూడా ఉన్నాయనే విషయం సాధారణ జనానికి ఇంకా తెలీదంటే ఆశ్చర్యం కలగక మానదు. అయితే ఈ సిగరెట్లతో కలిగే ప్రమాదాన్ని గుర్తించిన ప్రభుత్వం ఇంతలోనే వీటిని నిషేదించడం శుభపరిణామమే.

ఆరోగ్యానికి హానికరమే..

ప్రతి సిగరెట్టు పెట్టె అట్ట వెనుక ” పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం” అనే హెచ్చరిక కనిపిస్తూనే ఉంటుంది. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగకూడదనే ప్రకటనలు కూడా మనకు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వీటిని ఎంతమంది పాటిస్తున్నారు? అంటే మాత్రం జవాబు దొరకదు. పొగాకు నమలడం, పొగ తాగడం వంటి వాటితో గొంతు కేన్సర్ కేసులు దేశంలో అత్యధికంగా నమోదవుతూనే ఉన్నాయి. ప్రతి ఏడాది ఈ కేన్సర్ కారణంగా వేల సంఖ్యలో మరణిస్తున్నారు. అయినప్పటికీ ప్రభుత్వాలు మాత్రం ధూమపానాన్ని నిషేదించలేకపోతున్నాయి. సిగరెట్ల రేటు పెంచితే పొగతాగేవారి సంఖ్య తగ్గించవచ్చు అని మాత్రం భావించారు. కానీ ప్రభుత్వం ఆలోచనకు విరుద్ధంగా వాస్తవం ఉంది. అధిక ధర చెల్లించి మరీ సిగరెట్లు కొంటున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ధర పెరిగినంత మాత్రన పొగతాగేవారి సంఖ్య ఏమాత్రం తగ్గలేదని గుర్తించలేకపోయారు.

అయితే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే దాని ప్రభావం కేవలం కాల్చే వాడికంటే పక్కనున్న వారికే ప్రమాదకరమంటూ నివేదికలు చెబుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికీ పబ్లిక్‌గా సిగరెట్ తాగే వారు మనకు అడుగడుగునా కనిపిస్తూనే ఉంటారు. పొగాకుతో తయారైన సిగరెట్లు కాల్చడం మూలంగా శ్వాసకోస,ఊపిరితిత్తుల వ్యాధులతో ఎంతో మంది ఆస్పత్రిపాలవుతున్నారు. మన దేశంలో దాదాపుగా పొగతాగే అలవాటు ఉన్నవారు సాధారణంగా పాన్ డబ్బాలు, చిల్లర దుకాణాల్లో లభ్యమయ్యే బ్రాండెడ్ కంపెనీల సిగరెట్లు కాల్చేవారే. అదే విధంగా గొంతు కేన్సర్ వంటి సమస్యలతో బాధపడే ఎంతోమంది పొగాకును నమిలే అలవాటు ఉన్నావారే. ఇంత పెద్ద ఎత్తున ప్రమాదానికి కారణమవుతున్న పొగాకును నిషేదించకుండా.. పొగాకుతో ఆధారిత వస్తువుల్ని నిషేదించకుండా కేవలం ధనవంతులు, సెలబ్రిటీలు మాత్రమే ఉపయోగించే ఎలక్ట్రానిక్ సిగరెట్లను నిషేదిస్తే ఉపయోగం ఏమిటన్న ప్రశ్న వస్తుంది. దీనికి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి.

పొగాకు వల్ల కలిగే నష్టాలు, దానితో వచ్చే సమస్యల గురించి న్యూస్ పేపర్లు, టీవీలు, సినిమా థియేటర్లలో ప్రభుత్వం ఇచ్చే ప్రకటనలు చాల గొప్పగా ఉంటాయి. వీటిలో ముఖేశ్ అనే వ్యక్తి సిగరెట్ ,పాన్, తంబాకు వంటివి నమలడం వల్ల తనకు గొంతు కేన్సర్ వచ్చందని, బహుషా తాను ఇక మాట్లడలేనంటూ ఎంతో బాధపడుతూ కనిపిస్తాడు. ఇవన్నీ చూస్తూ కూడా కోట్లాదిమంది సిగరెట్లను ఇంకా తాగుతూనే ఉన్నారు. పొగాకు నములుతూనే ఉన్నారు. మార్పు అనేది మాత్రం రావడంలేదు.

ఈ సిగరెట్ కథేంటీ?

ఇక ఈ -సిగరెట్ కాల్చడం మూలంగా శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల సమస్యలు, గుండెజబ్బుల వంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణ సిగరెట్‌లో పొగాకు ఉంటే ఈ సిగరెట్‌లో ఒక రకమైన ద్రవపదార్ధం ఉంటుంది. దీన్ని ఆవిరిగా మార్చేందుకు బ్యాటరీ కూడా ఉంటుంది. దీని సహాయంతో ఆవిరిని పీల్చుతూ ఆనందిస్తారు. ఈ సిగరెట్లు రకరకాల రుచుల్లో లభిస్తాయి. స్ట్రాబెర్రీ, రూట్ బీర్, చాయ్ టీ వంటి, మెంథాల్ వంటి ఫ్లేవర్లలో దొరుకుతాయి. ఈ సిగరెట్లు మార్కెట్‌లోకి ప్రవేశించే సమయంలో ఆయా కంపెనీలు బ్రహ్మండమైన ఎత్తుగడతో ముందుకు వచ్చాయి. ధూమపానం మానివేయాలని భావిస్తున్నవారికి ఇదొక అద్భుతమైన వరమని, దీన్ని తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే సిగరెట్ కాల్చే అలవాటు పూర్తిగా మానుకుంటారని మభ్యపెట్టారు. ఇప్పుడు అవన్నీ అబద్దాలేనని, సాధారణ సిగరెట్ కంటే దీనివల్లే ఎక్కవ నష్టం ఉందని వైద్యులు తేల్చారు. అయితే మనకు తెలియని ఒక చేదు నిజం ఏమిటంటే.. ధూమపానం చేసేవారు క్రమంగా తగ్గిపోవడంతో తమ వ్యాపారాలు నష్టాల్లోకి వెళ్లే ప్రమాదముందని గ్రహించిన పలు బ్రాండెడ్ కంపెనీలు ఈవిధంగా ఈ సిగరెట్లను మార్కెట్లోకి దించాయని కూడా సమాచారం.

ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 30 దేశాల్లో ఈ సిగరెట్‌ను బ్యాన్ చేశారట. ప్రపంచ ఆరోగ్య సంస్ధ డబ్ల్యూహెచ్ఓ చెబుతున్నదానిని బట్టి ప్రతి ఏడాది 8 మిలియన్ల మంది పొగాకు కారణంగా మరణిస్తున్నారట. అదే విధంగా 1.2 మిలియన్ల మంది పొగతాగే వారి పక్కన నిలబడి, వారి వదిలిన పొగ కారణంగానే మరణిస్తున్నారట. ప్రపంచ ఆరోగ్య సంస్ధ నివేదిక బట్టి పొగాకు ఎంత ప్రమాదకరమో అర్ధమవుతోంది. అయితే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతన్నా పొగాన విషయంలో ఎందుకు ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కబెట్టాల్సి వస్తుందో మాత్రం అర్ధం కావడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొగాకు సంబంధిత వస్తువుల్ని నిషేదించకుండా.. ఎక్కడో ఎవరో దనవంతులు విలాసవంతంగా కాల్చే ఈ సిగరెట్లను నిషేదిస్తే ఎవరికి లాభం అని ప్రశ్నిస్తున్నారు.