ఉన్నప్పుడు మెుహం చాటేశారు..ఇప్పుడు కపట ప్రేమ కురిపిస్తున్నారా?

Politics Around Kodela Siva Prasad Death, ఉన్నప్పుడు మెుహం చాటేశారు..ఇప్పుడు కపట ప్రేమ కురిపిస్తున్నారా?

కోెడెల శివప్రసాదరావు.. గుంటూరు జిల్లాతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన నేత. పల్నాటి పులిగా పేరు తెచ్చుకున్నారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి.. అంచెలంచెలుగా ఎదిగి.. నవ్యాంధ్రప్రదేశ్ తొలి సభాపతి స్థానాన్ని అందుకున్నారు. అంతేకాదు హోం మంత్రితో పాటు పలు గొప్ప, గొప్ప పదవులు ఆయన్ను వరించాయి. ఎన్టీఆర్ పిలుపుతో అనూహ్యంగా రాజకియాల్లోకి వచ్చిన కోడెల కొన్నాళ్లు ఓటమనేదే లేకుండా విజయబావుట ఎగరవేశారు. అటువంటి నేత బలవన్మరణానికి పాల్పడటం అందరిని కలచివేస్తోంది. 2019 పార్టీ ఓటమి తర్వాత ఆయన తీవ్ర స్థాయిలో ఒత్తిడిని ఎదుర్కున్నారు. వాస్తవానికి ఆయనకు ఈ ఎన్నికల్లో అస్సలు టికెట్ కేటాయించొద్దంటూ టీడీపీలోని ఓ వర్గం ఎన్నికలకు ముందు నిరసనలకు దిగింది. ‘టీడీపీ ముద్దు..కోడెల వద్దు’ అంటూ ఓ స్లోగన్ పట్టుకోని మరీ ప్రచారం చేశారు. నెగటీవ్‌ వేవ్ ఉన్నా కూడా కానీ అంత సీనియర్ నేతకు టిక్కెట్ ఇవ్వకపోవడం భావ్యం కాదని భావించిన చంద్రబాబు..అందరిని ఒక్కతాటిపైకి తెచ్చి..కోడెలకు బీఫాం అందించారు. కానీ జగన్ వేవ్ ముందు ఆయన కూడా ఓటమిపాలు కాక తప్పలేదు.

ఎన్నికలు ముగిసిన తర్వాత కొన్నాళ్లు కోడెల కుటుంబమే రాష్ట్ర రాజకియాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆయనతో పాటు కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదయ్యాయి. ‘కే ట్యాక్స్’ పేరుతో అధికారాన్ని అడ్డుపెట్టుకోని కోడెల కుటుంబం అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సెంబ్లీ ఫర్నీచర్‌ వ్యవహారం కోడెలను మరింత కృంగదీసింది. తాను సభాపతిగా వ్యవహరించిన అసెంబ్లీకి చెందిన అధికారులు ఆయనపై ఫిర్యాదు చేశారు. ఫర్నిచర్ విషయంలో కోడెలదే తప్పుందని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు వర్ల రామయ్య తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లిబుచ్చడం గమనార్హం.  అసలు ప్రతిపక్షంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడిపై రానన్ని ఆరోపణలు కోడెలపై, ఆయన కుటుంబ సభ్యులపై వచ్చాయి.

ఇన్ని కేసులు నమోదవుతున్నా..ఆయనకు టీడీపీ పార్టీ నుంచి ఏనాడు మద్దతు లభించలేదు. రాజకీయ ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడం కోడెలకు పెద్ద కష్టమేమీకాదు. పండిపోయిన రాజకీయ నేతగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. అవన్నీ సహజమే అన్నది ఆయనకు తెలిసిన విషయమే. కానీ తాను ఇంతకాలం నమ్మిన, సేవలందించ పార్టీ కనీస మాట కూడా మాట్లాడకపోవడం కోడెలను కృంగదీశిందని రాజకీయ నిపుణుల అభిప్రాయం. అధినేత చంద్రబాబు కూడా ఆ టైంలో కోెడెలకు మద్దతుగా ఉంటే..రాజకీయంగా నష్టం జరిగే ప్రమాదం ఉండటంతో సైలెంట్‌గా ఉండిపోయారు. పార్టీకి చెందిన సీనియర్ నేతలు ఎవ్వరూ కూడా ఆయనను పలుకరించే సాహసం చెయ్యలేదు. చేసేది ఏమి లేక ప్రెస్ మీట్ పెట్టిన కోడెల..తమపై పెట్టిన కేసులన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనంటూ వివరణ ఇచ్చుకున్నారు.  కానీ ఇప్పుడు ఆయన మరణాన్ని మాత్రం వాడుకుని రాజకీయంగా లబ్ది పొందే టీడీపీ అడుగులు వేస్తుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన పార్టీలో ఉంటే ఇమేజ్ దెబ్బంతింటుందని..బయటకు పంపించేయాలని అధినేతకు ఫిర్యాదు చేసిన నేతలు కూడా ఇప్పుడు కపట కన్నీరు కారుస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.  ఆయన అన్ని కష్టాల్లో ఉన్నా కూడా పార్టీ మారే సాహసం చెయ్యలేదు. చాలా మంది నేతల్లాగానే బీజేపీ తీర్థం పుచ్చుకుని ఉంటే..కోడెల తన రాజకీయ ప్రస్థానాన్ని మరికొంతకాలం కంటిన్యూ చేసేవారేమో. అమ్మ లాంటి పార్టీని వదిలెయ్యకూడదని ఆయన భావన కాబోలు. ఏది..ఏమైనా టీడీపీ పార్టీ మాత్రం కోడెల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరించిందన్న మాట వాస్తవం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *