‘మీ తలిదండ్రుల ఫోటోలు లేవేం’ ? తేజస్వి యాదవ్ కి రవిశంకర్ ప్రశ్న

కొత్త బీహార్ సృష్టిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. మీ పార్టీ ఎన్నికల పోస్టర్లలో మీ పేరెంట్స్ (లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి)  ఫోటోలు మిస్సయ్యాయని ఆయన అన్నారు.

  • Umakanth Rao
  • Publish Date - 10:59 am, Tue, 27 October 20

కొత్త బీహార్ సృష్టిస్తామంటూ ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇస్తున్న హామీని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఎద్దేవా చేశారు. మీ పార్టీ ఎన్నికల పోస్టర్లలో మీ పేరెంట్స్ (లాలూ ప్రసాద్ యాదవ్, రబ్రీదేవి)  ఫోటోలు మిస్సయ్యాయని ఆయన అన్నారు. ఈ రాష్ట్రానికి ఒకప్పుడు ముఖ్యమంత్రులైన ఈ ఇద్దరి ఫోటోలను పోస్టర్లలో చేర్చకుండా ఎందుకు సిగ్గు పడుతున్నారని అన్నారు. పూర్నియాలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన రవిశంకర్ ప్రసాద్..సుమారు 15 సంవత్సరాలు మీ తలిదండ్రులు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరించలేదా అని ప్రశ్నించారు. వీరి ఫోటోలను చేరిస్తే ఇక్కడి భాట్టా బజార్ లో లోగడ జరిగిన కిడ్నాపింగ్ ల గురించి ప్రజలు తప్పకుండా అడుగుతారని ఆయన పేర్కొన్నారు. నాడు అనేకమంది భయంతో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లిపోయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. బహుశా అందుకే మీ తలిదండ్రుల ఫోటోలను మిస్ చేసినట్టు ఉన్నారు అని సెటైర్ వేశారు. నవంబరు 7 న పూర్నియా లో మూడవది, చివరి ఎన్నికలు జరగనున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధిస్తూ  వస్తోంది.