అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం, మొద్దు నిద్రపోయారంటూ అసహనం!

ఢిల్లీ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. నాలుగైదు అక్షింతలు కూడా వేసింది.. కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నా చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ మండిపడింది..

  • Balu
  • Publish Date - 4:16 pm, Thu, 19 November 20
అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కార్‌పై ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం, మొద్దు నిద్రపోయారంటూ అసహనం!

ఢిల్లీ ప్రభుత్వంపై అక్కడి హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది.. నాలుగైదు అక్షింతలు కూడా వేసింది.. కరోనా కేసులు ఇంతగా పెరుగుతున్నా చర్యలు ఎందుకు చేపట్టలేదంటూ మండిపడింది.. కరోనాతో మరణించిన వారి కుటుంబసభ్యులకు ఏమని సమాధానం చెబుతారు? అంటూ నిలదీసింది.. రోజురోజుకీ వైరస్‌ పెరుగుతూ ఉంటే ఎందుకు అలెర్ట్‌ కాలేదంటూ ప్రశ్నించింది. వివాహాది శుభ కార్యక్రమాలలో పాల్గొనే అతిథుల సంఖ్యను తాము పట్టించుకునేంత వరకు ఎందుకు తగ్గించలేదని నిలదీసింది హైకోర్టు. ఢిల్లీలో కరోనా పరీక్షలను పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ రాకేశ్‌ మల్హోత్రా అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై డిల్లీ హైకోర్టు ఈరోజు విచారణ జరిపింది. కరోనాపై ఆమ్‌ ఆద్మీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘ఈ నెల ఒకటి నుంచి కరోనా వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతూ ఉన్నదని సంగతి మీకు తెలుసు.. కేసుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతున్న విషయమూ తెలుసు.. అయినా కోర్టు జోక్యం చేసుకునేంత వరకు చర్యలు ఎందుకు చేపట్టలేదు’ అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది న్యాయస్థానం.. పరిస్థితి చేయిదాటేంతవరకు మొద్దు నిద్రపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.. వివాహ వేడుకలకు హాజరయ్యే అతిథుల సంఖ్యను 50కి తగ్గించేందుకు ఇంతకాలం ఎందుకు ఎదురుచూడాల్సి వచ్చిందని ప్రశ్నిస్తూనే ఈ 18 రోజులలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా? అంటూ నిలదీసింది.. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు ఏం చెబుతారు ? అంటూ ప్రభుత్వాన్ని కడిగిపారేసింది. అలాగే కోవిడ్‌-19 నిబంధనలపై కూడా ఢిల్లీ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. మాస్క్‌లు ధరించనివారిపైనా, భౌతికదూరం పాటించనివారిపైనా జరిమానాలు విధిస్తే సరిపోదని, కఠినమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కరోనా కేసుల సంఖ్య విషయంలో న్యూయార్క్‌, సావోపాలో వంటి నగరాలను ఢిల్లీ ఏనాడో దాటేసిందని చురకలేసింది.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితిని భూతద్దంలోంచి చూడాలని ఘాటుగా చెప్పింది..