“మహా”సంగ్రామంలో విజేత ఎవరు..?

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా గడవలేదు. కానీ అప్పుడు దేశంలో మిని సంగ్రామానికి తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంతేకాదు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నా 64 స్థానాలకు కూడా షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఈసీ విడుదల చేసిన ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. అయితే ఈ […]

మహాసంగ్రామంలో విజేత ఎవరు..?
Follow us

| Edited By:

Updated on: Sep 22, 2019 | 5:25 AM

సార్వత్రిక ఎన్నికలు ముగిసి ఏడాది కూడా గడవలేదు. కానీ అప్పుడు దేశంలో మిని సంగ్రామానికి తెరలేచింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలకు ఎన్నికల నగారా మోగింది. సెప్టెంబర్ 21 మధ్యాహ్నం ఎన్నికల కమిషన్ రెండు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. అంతేకాదు పలు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్నా 64 స్థానాలకు కూడా షెడ్యూల్ ప్రకటించింది.

అయితే ఈసీ విడుదల చేసిన ఈ రెండు రాష్ట్రాల్లో ప్రస్తుతం బీజేపీ పార్టీనే అధికారంలో ఉంది. అయితే ఈ సారి మహారాష్ట్ర ఎన్నికలు రసవత్తరంగా సాగనున్నాయి. అక్టోబ‌ర్ 21వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 288 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 234 జనరల్, 29 షెడ్యూల్ కులాలు, 25షెడ్యూల్ తెగ‌ల‌కు సీట్లు కేటాయించారు. అయితే ఈ సారి బరిలో పార్టీలన్నీ దాదాపు కూటములుగా ఏర్పడి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఏ విధంగానైనా బీజేపీని ఓడించి.. అధికారం చేపడతామని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శపథం చేశారు. అంతేకాదు.. అందుకు తగ్గట్లుగా పావులు కూడా కదుపుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందే.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇరు పార్టీలు 50-50 ప్రాతిపదికన మొత్తం 250 స్థానాల్లో పోటీ చేస్తాయని.. (ఎన్సీపీ 125, కాంగ్రెస్ 125) మిగతా 38 స్థానాల్లో చిన్న పార్టీలు పోటీలో ఉంటాయన్నారు. అయితే అధికారికంగా ఇరు పార్టీలు ఇంకా సీట్ల సర్ధుబాటు గురించి వెల్లడించలేదు. అయితే అదే సమయంలో అధికారంలో ఉన్న బీజేపీ.. ఈ సారి శివసేనతో పొత్తు పెట్టుకుంటుందా.. లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.

శివసేన చీఫ్ ఉద్దవ్ థాక్రే మాత్రం బీజేపీతో కలిసి ఈ సారి ఎన్నికల్లో పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే మరోవైపు కొందరు బీజేపీ నేతలు మాత్రం ఈ సారి పార్టీ ఒంటరిగా పోటీలోకి దిగబోతుందని.. అమిత్ షా కూడా సొంతంగా అధికారంలోకి వచ్చేందుకు తగిన వ్యూహాన్ని రూపొందించారంటున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పొత్తులు విఫలమై ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ ఇరు పార్టీలు కలిసి పోటీ చేశాయి. మొత్తం 48 ఎంపీ స్థానాలకు గాను.. 25 చోట్ల బీజేపీ, 23 చోట్ల శివసేన పోటీచేశాయి. అయితే ఈ బంధం కంటిన్యూ అవుతుందన్న ఆశాభావం ఇరు పార్టీల అగ్రనేతల్లో ఉన్నా.. పార్టీ శ్రేణుల్లో మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇరు పార్టీలు ఈ సారి చెరి సమానంగా సీట్లు సర్ధుబాటు చేసుకుని.. అందులోనే మిత్రపక్ష పార్టీలకు కూడా కొన్ని సీట్లు కేటాయించాలని భావిస్తున్నారు. ఒకవేళ పొత్తులు విఫలమైతే.. పూర్తిస్థానాల్లో అభ్యర్థులను ప్రకటించే విధంగా ప్లాన్లు కూడా రెడీ చేసుకుంటున్నారు. అయితే ఇరు పార్టీలు మధ్య సఖ్యత కుదిరితే.. బీజేపీ-శివసేన కలిసి దాదాపు 200 స్థానాలను పైగా గెలుచుకుంటాయంటూ అప్పుడు జాతీయ ఛానెల్లు ప్రీ పోల్ సర్వేలను ప్రకటిస్తున్నారు. అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈ సారి బీజేపీని ఓడించడం ఖాయమంటున్నారు. లోక్ సభ ఎన్నికలకూ, అసెంబ్లీ ఎన్నికలకూ సంబంధం లేదని.. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రజలు వేరే మూడ్‌లో ఉన్నారని శరద్ పవార్ వ్యాఖ్యానించారు. పుల్వామా దాడి కారణంగానే బీజేపీ మహారాష్ట్రలో సార్వత్రిక ఎన్నికల్లో నెగ్గిందన్నారు. ఫడ్నవీస్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని.. పదవి నుంచి దింపేందుకు రెడీగా ఉన్నారని పవార్ అంటున్నారు.

అయితే నరేంద్ర మోదీ రెండో సారి అధికారంలోకి వచ్చాక ఎదుర్కొంటున్న మొదటి అసెంబ్లీ ఎన్నికలు ఇవే కావడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2014లో జరిగిన ఎన్నికల్లో 288 స్థానాలకు గానూ బీజేపీ 122 స్థానాలను కైవసం చేసుకుంది. విదర్భ, మరఠ్వాడా, ముంబై రీజీయన్ లలో కాంగ్రెస్ బలంగానే ఉన్నా, ఈ మధ్య కాలంలో పార్టీలో చోటుచేసుకున్న అంతర్గత వ్యవహారాలతో బలహీన పడినట్లు తెలుస్తోంది. అయితే ఫడ్నవీస్ చేపట్టిన ‘‘మహాజనాదేశ్ యాత్ర’’ బీజేపీకి ఉపకరిస్తుందనే అంచనాలూ ఉన్నాయి. మరి అక్టోబర్ 21న జరిగే మహా సంగ్రామంలో విజేతలెవరో వేచిచూడాలి.