హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ?

Who is King? Political analysis, హస్తినలో ఎవరు కింగ్ ? హంగ్ తప్పదా ?

ఎన్నికల ‘ క్రతువు ‘ ముగిసింది. ఇక ఫలితాల వెల్లడికి వారం రోజులు మాత్రమే వ్యవధి ఉంది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన ఇండియాలో..ఓ  రాజకీయ మహా సంగ్రామానికి తెర ముగిసినట్టే.. ఈవీఎం లలో నిక్షిప్తమైన అభ్యర్థుల ఓట్లు..ఎవరిని హస్తిన సింహాసనం మీద కూర్చోబెట్టాలో, ఎవరిని కాదో తేల్చే రోజు త్వరలో రానుంది. ప్రధాన పార్టీల భవితవ్యం ఈ సుదీర్ఘ ఎన్నికల రణరంగంలో ఎలా, ఏ మలుపు తిరుగుతుందో చెప్పగల ‘ దమ్ము ‘ ఏ జ్యోతిష్కుడికీ లేకపోవడమే విడ్డూరం. అయిదేళ్ళు అధికార పీఠమెక్కిన కమలనాథులు మళ్ళీ ఇదే పీఠాన్నిఅధిరోహిస్తారా..లేక ఇన్నేళ్ళూ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ కి ‘ అదృష్ట యోగం ‘ పడుతుందా?  ప్రధాని మోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ జాతకాలను నిర్దేశించనున్న ఈ ఎన్నికల్లో తమ గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. లోక్ సభ ఎన్నికల్లో తమకు 300 సీట్లు లభిస్తాయని మోదీ ఘంటాపథంగా చెబుతుంటే రాహుల్ ఈ ‘ ధీమా ‘ ను కొట్టి పారేస్తున్నారు. మీకంత సీన్ లేదని, ప్రాంతీయ పార్టీల అండతో తామే కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అంటున్నారు. ఏడు దశల్లో సాగిన ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరి దశలో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య రేగిన హింసను ఈ దేశం ఆశ్చర్యంగా చూసింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తనకు ఎన్నడూ కలగని అనుభవాన్ని బెంగాల్ ప్రచారం సందర్భంగా ఎదుర్కోవడం కొసమెరుపు. సి ఆర్ పీ ఎఫ్ బలగాలే లేకపోతే తాను గాయపడి ఉండే వాడినేమో అని ఆయన చేసిన వ్యాఖ్యలు నాటి అల్లర్లు, హింసను చెప్పకనే చెప్పాయి. మోదీని చెంపదెబ్బ కొడతానంటూ మమతా బెనర్జీ, ఆ చెంపదెబ్బ తనకు వరమేనని మోదీ చేసిన వ్యాఖ్యలు..ఇప్పటికీ అందరి చెవుల్లో గింగురు మంటున్నాయి. మన దేశ ప్రజాస్వామ్యం మరీ ఇంత ‘ హాట్ హాట్ ‘ గా సాగుతోందని నోళ్ళు నొక్కుకోనివాళ్ళు లేరు.  సాధ్వి  ప్రగ్యా సింగ్ ఠాకూర్ వంటి నేతలు మధ్యలో గాడ్సేను దేశభక్తుడంటూ కామెంట్లు చేసి పొలిటికల్ హీట్ ను మరింత పెంచారు. తమ పార్టీ అధినేత మెప్పు పొందేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ తరఫున చెల్లెలు ప్రియాంక గాంధీని రాహుల్ ప్రచార రంగంలోకి దించినా,,ప్రధానంగా ఆమెను యూపీకే పరిమితం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రధాన నేతల మధ్య పరస్పర వ్యక్తిగత  దూషణలు, ఆరోపణలు ఆకాశాన్నంటాయి. రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీని అత్యంత అవినీతి పరుడని మోదీ దుయ్యబడితే.. రాఫెల్ ఒప్పందంలో మోదీ చౌకీదారు కాదని చౌకీదార్ చోర్ అని రాహుల్ పదేపదే దుయ్యబట్టారు. ఎవరు..ఎన్ని రాజకీయ పోకడలకు పోయినా.. ఓటర్లు వీరిలో ఎవరిని ‘ అక్కున ‘ చేర్చుకుంటారన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకీ మెజారిటీ రాక, మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోతే.. స్వతంత్ర అభ్యర్థులు, చిన్నా చితకా పార్టీలు, ప్రాంతీయ పార్టీలే ప్రధాన పార్టీలకు అండ. కేంద్రంలో హంగ్ ఏర్పడే సూచనలే ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెప్పకనే చెబుతున్నాయి. చూద్దాం.. ఏం జరుగుతుందో ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *