పల్నాడు ఉద్రిక్తత.. రేపు ఏం జరగబోతోంది..!

What will happen in Palnadu tomorrow?, పల్నాడు ఉద్రిక్తత.. రేపు ఏం జరగబోతోంది..!

పల్నాడులో పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్తంగా మారాయి. ఎన్నికలకు ముందు అక్కడ ఏర్పడిన పరిస్థితులు ఆ తరువాత మరింత పెరుగుతూ.. ఇప్పుడు తారాస్థాయికి చేరుకున్నాయి. వారు మాపై దాడి చేశారంటే.. కాదు వారే మాపై దాడి చేశారంటూ వైసీపీ, టీడీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. దీంతో ఏపీ రాజకీయం పల్నాడు చుట్టూ తిరుగుతోంది. మరోవైపు పల్నాడులో రేపు ‘చలో ఆత్మకూరు’కు పిలుపునిచ్చాయి రెండు పార్టీలు. దీంతో టెన్షన్ వాతావరణం మరింత పెరిగింది.

గుంటూరులోని పునరావాస శిబిరాల్లో ఉన్న వైసీపీ బాధితులను స్వయంగా తానే తీసుకువెళతానని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరులో వైసీపీ శ్రేణుల దాడుల్లో గాయపడిన బాధితులను వెంటబెట్టుకొని గ్రామానికి తీసుకెళ్లేందుకు ఆయన ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలీసులు అనుమతులు నిరాకరించినా ఛలో ఆత్మకూరు చేసి తీరాలని ఆయన నిర్ణయానికి వచ్చారు. మరోవైపు వైసీపీ నేతలు కూడా అదే ధీమాతో ఉన్నారు. టీడీపీ బాధితులను వెంటబెట్టుకొని గ్రామాలకు వెళ్లాలని వారు నిర్ణయానికి వచ్చారు.

ఇలాంటి నేపథ్యంలో పల్నాడులో సెక్షన్ 144, 30ను విధించారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. పల్నాడులో ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనకు అనుమతిని ఇవ్వబోమని చెప్పుకొచ్చిన గౌతమ్ సవాంగ్.. శాంతి భద్రతల విషయంలో అన్ని వర్గాలు, రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని కోరారు. పల్నాడులో ఎలాంటి అవాంచనీయ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లో అదనపు బలగాలు మోహరించాయి. బాధితులను వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు పలుచోట్ల ఇప్పటికే నేతలను ముందస్తుగా అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో వైసీపీ, టీడీపీ నేతలు రేపు ఏం చేయబోతున్నారు..? అసలు ఛలో ఆత్మకూరు కార్యక్రమంలో రేపు ఏం జరగబోతుందన్న టెన్షన్ అందరిలో నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *