ఒంటరిగా రాజగోపాల్ రెడ్డి..! ప్రయాణం ఎటు..?

What is the Future Course of Congress Leader Komatireddy Rajagopal Reddy, ఒంటరిగా రాజగోపాల్ రెడ్డి..! ప్రయాణం ఎటు..?

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. రాజకీయ చరిత్రలో ఈ పేరుకు ఓ హిస్టరీ ఉంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారారు. గత కొన్ని రోజులుగా.. పార్టీ మారుతానని హడావిడి చేస్తూ.. అటు తూగలేక.. ఇటు ఉండలేక.. విచిత్ర పాత్రను పోషిస్తున్నారు.

తెలంగాణలో టీఆర్ఎస్‌కి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే.. అని గతంలో ప్రకటించిన ఆయన.. ఆ తరువాత యూటర్న్ తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సృష్టించిన ప్రకంపనలు ఆగటం లేదు. కాంగ్రెస్ అధిష్టానంపైన తీవ్ర వ్యాఖ్యలు కొనసాగిస్తున్న ఆయన తాజాగా.. మరోసారి ఈ పీసీసీసీ చీఫ్ మారాలంటూ.. పాత పాటే పాడుతూ వస్తున్నారు. ఇక బీజేపీలో చేరటానికి ముహూర్తం సిద్ధం చేసుకున్న రాజగోపాల్ రెడ్డి.. పార్టీలో చేరకముందే సంచలన వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్‌లోనే కొనసాగుతూ.. సమయం వచ్చినప్పుడల్లా.. పార్టీని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు.

తెలంగాణ టీపీసీసీ చీఫ్ పదవిని ఆయన ఆశిస్తున్నట్టు.. వార్తలు వస్తున్నప్పటికీ.. పార్టీ అధిష్టానం మాత్రం దీనిపై.. నోరెత్తడం లేదు. కుంతియా వంటి సీనియర్ నేతలు.. ఎంతసేపూ ఆయనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని.. చెబుతున్నా.. అధిష్టానం ఇందుకు సంబంధించి నిర్థిష్టమైన చర్యలేవీ తీసుకోని దాఖలాలు కనబడుతున్నాయని అంటున్నారు. అయితే.. బ్రదర్స్ ఇద్దరూ.. కలిసే ఈ సరికొత్త నాటకానికి తెర తీశారా అని.. రాజకీయ విశ్లేషకులు తర్జన భర్జన పడుతున్నారు.

అయితే.. ఎటూ తేల్చుకోని రాజగోపాల్ రెడ్డిపై కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి దారెటో అర్థం కాక ఆయన క్యాడర్ అంతా అయోమయం చెందుతున్నారట. అటు.. కాంగ్రెస్‌లో ఉంటారో.. ఇటు కాషాయ జెండా కప్పుకుంటారో.. తెలియని.. ఆయన వెంట నడవడం.. భవిష్యత్తులో తమ రాజకీయ మనుగడకు ముప్పు తలెత్తవచ్చునని.. ముందే.. ఇల్లు చక్కబెట్టుకుంటున్నారన్న వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

రాజగోపాల్ రెడ్డి అనిశ్చిత మనస్తత్వం పార్టీ వర్గాలను గందరగోళానికి గురిచేస్తుండగా.. ఆయన తరువాత స్టేట్‌మెంట్స్ ఇచ్చిన నేతలు మాత్రం గుట్టు చప్పుడు కాకుండా పార్టీ నుంచి జంప్ అయ్యారు. అంతేగాక.. బీజేపీ నుంచి ఆయనకు మాత్రం తగిన వెల్కమ్ లేదట. తెలంగాణ బీజేపీ నేతలు ఆయనకు అంతగా సహకరించడంలేదని టాక్. అందులోనూ.. బీజేపీలో చేరడం వల్ల తాను సీఎం రేసులో ఉండవచ్చని ఊహాగానాలు వ్యక్తం చేస్తోన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను.. స్వయానా ఆ పార్టీ వారు సైతం పట్టించుకోవడం లేదనే ప్రచారం సాగుతోంది.

బీజేపీ నేతల నుంచి ఆఫర్ వచ్చేవరకూ.. రాజగోపాల్ రెడ్డి.. వెయిట్ చేస్తున్నారని.. అక్కడి నుంచి గ్రీన్‌సిగ్నల్ వస్తే.. మూటాముళ్లూ సర్దేస్తారని సమాచారం. మరోవైపు.. టీపీసీసీ చీఫ్ పదవి కోసమే.. ఆయన రోజుకో మాట మార్చుతున్నారని.. కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. మొత్తానికి ఆయన దారెటు అనే దానిపై.. సస్పెన్స్ ఇప్పటికీ కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *