ధోని నిర్ణయానికి వెస్టిండీస్ బౌలర్ ఫిదా!

Sheldon Cottrell, ధోని నిర్ణయానికి వెస్టిండీస్ బౌలర్ ఫిదా!

వికెట్లు పడితే సెల్యూట్‌ చేస్తూ సంబరాలు చేసే వెస్టిండీస్ పేసర్‌ షెల్డన్ కాట్రెల్‌ క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమే. సైన్యంలో పనిచేసి విండీస్‌ జట్టులోకి అడుగుపెట్టిన కాట్రెల్‌ వికెట్లు తీస్తే సైన్యానికి గౌరవ సూచికగా కవాతు చేస్తూ సెల్యూట్‌ చేస్తాడు. అయితే రెండు నెలలు పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయం తీసుకున్న భారత మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీని కాట్రెల్‌ కొనియాడాడు. భారత ఆర్మీపై ధోనీకి ఉన్న అంకితభావం తనకి ఎంతో స్ఫూర్తినిచ్చిందని పేర్కొన్నాడు. ‘మైదానంలో ధోనీ ఎంతో స్ఫూర్తినిస్తాడు. అతను గొప్ప దేశభక్తుడు కూడా. దేశానికి సేవ చేయాలని అతనికి ఉన్న అంకితభావం అమోఘం. గత కొన్ని వారాలుగా నేను మా ఆటగాళ్లతో ఉన్నాను.’అని కాట్రెల్‌ ట్వీట్ చేశాడు.

అంతేకాకుండా భారత రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ చేతుల మీద ధోనీ అందుకున్న పద్మ భూషణ్‌ వీడియోను కాట్రెల్‌ షేర్‌ చేశాడు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ పురస్కారాన్ని అందుకోవడానికి సైనిక దుస్తులతో వచ్చి తనలోని దేశభక్తిని గొప్పగా చాటుకున్నాడు. ఈ వీడియోని కాట్రెల్ షేర్‌ చేస్తూ ‘ఈ వీడియోని స్నేహితులు, కుటుంబ సభ్యులకి షేర్‌ చేస్తున్నాను. ఎందుకంటే అటువంటి క్షణాన్ని నేను ఎంత గర్విస్తానో వాళ్లకి తెలుసు. ఆ క్షణంలో ధోనీ, అతని భార్య సాక్షిని చూస్తుంటే జీవిత భాగాస్వామిపై, దేశం పట్ల ఉన్న ప్రేమ ప్రతిబింబిస్తుంది.’ అని తెలిపాడు. వెస్టిండీస్‌ పర్యటనలో భాగంగా భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *