ఈసారి వర్షపాతం సాధారణం కంటే తక్కువ స్థాయి లో నమోదయ్యే అవకాశం ఉంది.

ప్రముఖ ప్రైవేటు వాతావరణ పరిశోధన సంస్థ ‘స్కైమెట్‌’ ఈ విషయాన్ని వెల్లడించింది.

నైరుతి రుతుపవన సమయమైన జూన్‌ నుంచి సెప్టెంబరు మధ్య  వర్షపాతం 94 శాతం (5% అటు, ఇటుగా) ఉంటుందని స్కైమెట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జతిన్‌ సింగ్‌ పేర్కొన్నారు.

రుతుపవన వర్షపాతానికి సంబంధించి ఎల్‌పీఏ 96 నుంచి 104% మధ్య ఉంటే దాన్ని సాధారణంగా పరిగణిస్తారు.

ప్రాంతాలవారీగా చూస్తే ఉత్తర, మధ్య భారత్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని స్కైమెట్‌ పేర్కొంది.

గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్రలో జులై, ఆగస్టు నెలల్లో అతితక్కువ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు పడతాయని వెల్లడించింది.

జూన్‌లో ఎల్‌పీఏ 99%, జులైలో 95%, ఆగస్టులో 92%, సెప్టెంబరులో 90% ఉండొచ్చని స్కైమెట్‌ అంచనా వేసింది.