ఇలా చేస్తే.. గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్

రాత్రి భోజనం తరువాత నిద్రకు ఉపక్రమించే ముందు.. ఒక గ్లాసు గోరువెచ్చని మంచినీళ్లు తాగండి. మళ్లీ ఉదయాన్నే నిద్రలేస్తూనే పరగడుపున కూడా గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి.

ఒక్కోసారి ఉదరంలో పుట్టుకొచ్చే ఎసిడిటీ చాలా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఏమి చేసినా ఒక పట్టాన తగ్గదు. అలాంటి పరిస్థితుల్లో బాగా మాగిన అరటిపండును తినండి.

కప్పు నీటిని మరిగించి.. ఒక టేబుల్‌స్పూన్‌ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటిలోకి ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి.

కాచి చల్లార్చిన గ్లాసుడు పాలలోకి ఒక స్పూను తేనె కలుపుకుని తాగండి. పాలలోకి అలవాటు ప్రకారం పంచదార లేదా బెల్లం, హార్లిక్స్‌ వంటివేవీ కలపకూడదు.

పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. కాసేపయ్యాక చల్లారిన తరువాత ఆ నీటిని సేవించండి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో గ్యాస్‌ కొంతవరకైనా తగ్గుతుంది.

మజ్జిగలోని లాక్టిక్‌ ఆసిడ్‌ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మరవొద్దు.

కడుపుబ్బరం తక్షణ సమస్యకు చక్కటి పరిష్కారం తాజా కొబ్బరి బోండం తాగడం. గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. రీఫ్రెష్‌ అవుతారు.

పూర్వం భోజనం తిన్న తరువాత ఒక బెల్లం ముక్కను నోట్లో వేసుకునేవారు పెద్దలు. ఇప్పటి తరానికి ఆ అలవాటు పోయింది కానీ.. బెల్లం వల్ల గ్యాస్‌ ఎంతగానో తగ్గుతుంది.