01 October
Subhash
పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడికి కేంద్రం చర్యలకు సిద్ధమైందని సమాచారం. నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ క్రైమ్‌ల్లో భాగస్వామ్యం గల సిమ్ కార్డుల రద్దు కోసం చర్యలు చేపడుతోంది.
ప్రతిపాదిత చర్యలకు కేంద్రం దిగితే 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు కావడంతోపాటు 2.26 లక్షల మొబైల్ ఫోన్లు బ్లాక్ అవుతాయని మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇటీవల కేంద్ర హోంశాఖ నిర్వహించిన సమీక్షలో సిమ్ కార్డుల కనెక్షన్ల రద్దు కోసం సిద్ధం చేసిన నివేదికను టెలికం శాఖ అధికారులు వెల్లడించారని తెలుస్తోంది.
కొత్త సిమ్ కార్డులు జారీ చేస్తున్నప్పుడు కేవైసీ రూల్స్ తప్పకుండా పాటించాలని టెలికం శాఖ అధికారులు తెలిపారు.
కంబోడియాలో చిక్కుకుపోయిన సుమారు 5000 మంది భారతీయులతో అక్కడి సైబర్ మోసగాళ్లు సైబర్ నేరాలు చేయిస్తున్నారని ఆ వార్తల సారాంశం.
చిక్కుకుపోయిన భారతీయుల ఇష్టానికి వ్యతిరేకంగా.. డేటా ఎంట్రీ పోస్టులకు భారీ వేతనాల ఆశ పెట్టి సైబర్ మోసాలు చేయించారు.
టెలీ కాలర్లుగా ఫోన్లు చేసి క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులతో భారీ లాభాలొస్తాయని వీరు నమ్మిస్తుంటారు. ఇది బయట పడటంతో కేంద్రం అప్రమత్తమై వివిధ శాఖల అధికారులతో కమిటీని నియమించింది.
ఈ నేపథ్యంలో నకిలీ పత్రాలతో పొందిన, సైబర్ నేరాలతో సంబంధం ఉన్న 2.17 కోట్ల మొబైల్ ఫోన్ల కనెక్షన్లను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది.