భారత్‌- పాక్‌ మ్యాచ్‌ కోసం ప్రత్యేక రైళ్లు..

13 October 2023

క్రికెట్‌ ప్రపంచం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఈ మహాసంగ్రామానికి సమయం వచ్చేసింది.అక్టోబరు 14న అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో భారత్‌-పాక్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.

ఈ నేపధ్యంలో పశ్చిమ రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ మ్యాచ్‌ కోసం ముంబయి నుంచి అహ్మదాబాద్‌కు ఓ వందే భారత్‌ సహా రెండు ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధమవుతోంది.

వందేభారత్‌ రైలు అక్టోబరు 13 రాత్రి తొమ్మిదిన్నర గంటలకు ముంబయి నుంచి బయల్దేరి మర్నాడు ఉదయం ఐదున్నర గంటలకు అహ్మదాబాద్‌ చేరుకుంటుంది.

ఆరంభ వేడుకలు లేకుండానే ఈ ప్రపంచకప్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో భారత్‌- పాక్‌ పోరుకు ముందు బీసీసీఐ నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు సమాచారం.

ఈ కార్యక్రమానికి సచిన్‌ టెండూల్కర్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ను బీసీసీఐ ఆహ్వానించినట్లు తెలిసింది. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా హాజరవుతారని తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ప్రదర్శన కూడా ఉంటుందని సమాచారం. ఈ ప్రతిష్ఠాత్మక మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ జట్టు అక్టోబరు 11న అహ్మదాబాద్‌ చేరుకుంది.

15 రోజుల పాటు హైదరాబాద్‌లో గడిపిన పాక్‌.. వార్మప్‌తో పాటు ప్రపంచకప్‌లో రెండు మ్యాచ్‌లాడిన సంగతి తెలిసిందే.

ఉప్పల్‌లో వరుసగా నెదర్లాండ్స్‌, శ్రీలంకపై విజయాలు సాధించిన పాక్‌.. భారత్‌తో మెగా పోరు కోసం నగరం నుంచి ప్రత్యేక విమానంలో బయల్దేరి వెళ్లింది.