అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’.
ఇటీవలే ఈ చిత్రంలోని ‘నాటునాటు’ సాంగ్ ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు సైతం కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం విడుదలై ఏడాది దాటినా రికార్డుల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.
జపాన్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
తాజాగా పది లక్షలమందికిపైగా ప్రేక్షకులకు చేరువైన చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
గతేడాది అక్టోబరులో జపాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఇప్పటికి నిరాటంకంగా ప్రేక్షకాదరణ పొందుతూనే ఉంది.
ప్రస్తుతం అక్కడ 44 నగరాల్లో 209 థియేటర్లు, 31 ఐమాక్స్ తెరలపై ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం ప్రదర్శితమవుతోంది.
ఈ మైలురాయి చేరుకోవడంపై మంగళవారం ‘జాపనీస్ అభిమానుల నుంచి మాకు మిలియన్ ప్రేమపూర్వక కౌగిలింతలు అందాయి.
మీ అభిమానానికి కృతజ్ఞతలు’ అని దర్శకుడు రాజమౌళి సైతం స్పందించారు.
బాక్సాఫీస్ అంచనాల ప్రకారం.. ఇప్పటికే జపాన్‌లో రూ.80 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది ‘ఆర్‌ఆర్‌ఆర్’.