ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.

ఐపీఎల్‌ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా 250 సిక్సర్లు కొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు రోహిత్‌.

ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మూడు సిక్సర్ల కొట్టి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు హిట్‌మ్యాన్‌.

ఈ మ్యాచ్‌లో 37 బంతుల్లో రోహిత్‌.. 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 పరుగులు చేశాడు.

ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో విండీస్‌ దిగ్గజం క్రిస్‌ గేల్‌ 357 సిక్స్‌లతో తొలి స్థానం ఉండగా తర్వాతి స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌(251), రోహిత్‌(250) కొనసాగుతున్నారు.

చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో 13 పరుగుల తేడాతో పంజాబ్‌ కింగ్స్‌పై ఓటమి పాలైంది ముంబై ఇండియన్స్‌.

215 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 201 పరుగులు మాత్రమే చేసింది.

ముంబై బ్యాటర్లలో ‍గ్రీన్‌(67), సూర్యకుమార్‌ యాదవ్‌(57), రోహిత్‌ శర్మ(44) పరుగులతో అద్భుత అట కనబర్చినప్పటికీ విజయం మాత్రం పంజాబ్‌నే వరించింది.

కాగా అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.