తుమ్మి మొక్క నిజంగా బంగార‌మే.. ఔష‌ధ గుణాలు పుష్కలం..!

Jyothi Gadda

09 May 2024

మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో అనేక ర‌కాల మొక్క‌లు పెరుగుతుంటాయి. వీటిని ఔష‌ధాలుగా ఎలా ఉప‌యోగించాలో తెలియ‌క మ‌నం ఎంతో న‌ష్ట‌పోతున్నాం. వినాయక చవితి రోజు తుమ్మికూర తినాలని అంటారు. ఈ కూర వల్ల కలిగే ప్రయోజనాలు పుష్కలం.

వ‌ర్షాకాలంలో తుమ్మి మొక్క‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తూ ఉంటాయి. ఈ మొక్క ఆకుల‌ను సేక‌రించి కూర‌గా వండుకుని తింటుంటారు. ఇలా కూర‌గా చేసుకుని తిన‌డం వల్ల అనేక ప్ర‌యోజ‌నాలు అందుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ మొక్క ఆకుల‌తో చేసిన కూర‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. అజీర్తి స‌మ‌స్య త‌గ్గుతంది. శ‌రీరం నుండి వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి. ప‌క్ష‌వాతం బాధితులకు తుమ్మి ఆకులతో చేసిన కూర‌ను పెట్ట‌డం వ‌ల్ల త్వ‌ర‌గా కోలుకుంటారు. 

తేలు, పాము విషాన్ని హ‌రించ‌డంలోనూ ఈ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. తుమ్మి మొక్క ఆకులను మెత్త‌గా దంచి ర‌సాన్ని తీయాలి. ఈ ర‌సాన్ని తేలు లేదా పాము కుట్టిన చోట వేయాలి. తేలు లేదా పాము కుట్టిన వ్య‌క్తి కూడా ఈ ర‌సాన్ని 2 టీ స్పూన్స్ చొప్పున తాగించాలి. 

నెల‌స‌రి స‌మ‌యంలో అధిక ర‌క్తస్రావంతో బాధ‌ప‌డే స్త్రీలు తుమ్మి ఆకుల‌ను తీసుకుని పేస్ట్ లా చేసి ఈ పేస్ట్ కు నిమ్మ‌ర‌సాన్ని, నువ్వుల నూనెను క‌లిపి ప‌ర‌గ‌డుపున తింటూ ఉండ‌డం వ‌ల్ల అధిక ర‌క్తస్రావం తగ్గిపోతుంది. 

తుమ్మి మొక్క ఆకుల ర‌సాన్ని రెండు పూట‌లా 2 టీ స్పూన్ల చొప్పున తాగుతూ ఉండ‌డం వ‌ల్ల జ్వ‌రం త‌గ్గుతుంది. గ‌జ్జి, తామ‌ర వంటి చ‌ర్మ వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలోనూ తుమ్మి మొక్క ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ మొక్క ఆకుల ర‌సాన్ని చ‌ర్మంపై లేప‌నంగా రాస్తే చ‌ర్మ వ్యాధులు త‌గ్గుతాయి.

శ‌రీరంలో నొప్పులు, వాపులు ఉన్న చోట ఈ మొక్క ఆకుల ర‌సాన్ని లేదా ఆకుల‌ను దంచి క‌ట్టుగా క‌ట్ట‌డం వ‌ల్ల కూడా ఈ స‌మ‌స్య‌ల‌ నుండి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఈ మొక్క ఆకుల‌తో చేసిన క‌షాయాన్ని నోట్లో ఉంచుకుని పుక్కిలించి ఉమ్మ‌డం వ‌ల్ల నోటిపూత త‌గ్గుతుంది. 

వారంలో ఒక్కసారైనా తుమ్మికూరని తింటే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పోతాయి. జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. చైనా వంటి చోట్ల దీనిని దగ్గు నివారిణిగా వాడతారు. గాయాలకు పైపూతగా వేస్తారు. దీని నుంచి తీసిన ఎసెన్షియల్‌ ఆయిల్‌ని సహజ మస్కిటో రెపల్లెంట్‌గా వాడతారు.