ఈ నెయ్యి కిలో రూ.2 లక్షలు మాత్రమే!

01 April 2024

TV9 Telugu

గుజరాత్‌లో కిలో నెయ్యి రెండు లక్షల రూపాయలు పలుకుతోంది. వామ్మో అంత రేటు పెట్టి నెయ్యి ఎవరు కొనుక్కుంటారు అనే సందేహం రావచ్చు. కానీ అక్కడే ఉంది అసలు ట్విస్టు.

గుజరాత్‌లోని గోండాల్‌లో రమేష్‌భాయ్‌ రూపరేలియా అనే రైతు గోశాలను నడుపుతున్నాడు. అతను స్వచ్ఛమైన ఆవుపాలతో నెయ్యిని తయారు చేసి... దాన్నుంచి రకరకాల ఉత్పత్తులు తయారు చేస్తుంటాడు.

ఇందులో విశేషం ఏముంది అనుకుంటే పొరపాటే.. ఈ నెయ్యిలో కుంకుమ పువ్వు, పసుపు, పిప్పళ్లు, గులాబీ రేకులు, మందారాలు... ఇలా రకరకాల మూలికలు కలుపుతాడు.

ఉదాహరణకి ఓ 30 లీటర్ల పాలనుంచి వచ్చిన వెన్నను కాచి అందులో ఈ మూలికల్ని వేసి కేజీ నెయ్యి అయ్యే వరకూ బాగా మరిగిస్తాడు.

అలా తయారైన ఈ నెయ్యి తినడానికి కాదండోయ్‌.. కేవలం చర్మానికే రాస్తారు. రకరకాల మూలికలతో తయారుచేసిన ఈ నెయ్యిని కాస్త ఒంటికి రాసుకుంటే తలనొప్పీ, చర్మవ్యాధులూ తగ్గుతాయట.

వాసన చూడ్డంతోనే దగ్గునుంచి ఉపశమనం కలుగుతుందట. ఇక చర్మసౌందర్యానికీ ఇది మంచి ఔషధం అంటున్నారు.

చర్మంపైన మొటిమల్నీ, నల్లమచ్చల్నీ అదుపుచేస్తుందట ఈ స్పెషల్‌ నెయ్యి. అందుకే ఈ నెయ్యి కిలో 3,500 రూపాయలనుంచి 2 లక్షల వరకూ ధర పలుకుతోంది.

అన్ని అనుమతులతో ఈ ఔషధాల నెయ్యిని - అమెరికా, కెనడా, సౌదీ అరేబియాతోపాటు దాదాపు వంద దేశాలకు ఎగుమతి చేస్తూ ఏడాదికి కోట్లలో ఆదాయం రాబడుతున్నారు రమేష్‌.