మజ్జిగతో మరచిపోలేని ప్రయోజనాలు..సీజన్‌ ఏదైనా సరే!

Jyothi Gadda

28  April 2024

పెరుగులో నీరు కలిపి చిలికితే వచ్చే పలుచని పానీయం మజ్జిగ. పెరుగుకు నాలుగురెట్లు నీళ్లు కలిపి చిలికి వెన్న తొలగిస్తే మజ్జిగ తయారవుతుంది. మజ్జిగలో కొవ్వును తొలగిస్తారు. కనుక పెద్ద వయసువారితో సహా అందరికీ మంచి చేస్తుంది. 

మజ్జిగ మూడు దోషాలనూ తగ్గిస్తుంది. మజ్జిగను సైంధవ లవణంతో కలిపి తీసుకుంటే వాతాన్ని తగ్గిస్తుంది. పటిక బెల్లంతో కలిపి తీసుకుంటే పైత్యం తగ్గుతుంది. మజ్జిగకు శొంఠి, పిప్పళ్లు, మిరియాల చూర్ణం కలిపి తీసుకుంటే కఫం తగ్గుతుంది.

ఆవు మజ్జిగ మూడు దోషాలను తగ్గిస్తుంది. పథ్యంగా, ఆకలిని పెంచేదిగా, రుచికారకంగా, బుద్ధివర్థకంగా పనిచేస్తుంది. గేదె మజ్జిగ కఫాన్ని పెంచుతుంది. అలాగే వాపును పెంచుతుంది. కాబట్టి పరిమితంగా వాడాలి. మేక మజ్జిగ తేలికగా ఉంటుంది.

కేవలం వేసవి కాలంలోనే కాదు.. మజ్జిగను ఏ సీజన్‌లో అయినా తీసుకోవచ్చు. ఇందులో సోడియం , క్యాల్షియం మూలకాలు మెండుగా ఉంటాయి.. వీటితో పాటు ప్రోటీన్స్, మినరల్స్ కూడా ఉంటాయి.. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని , పోషకాలను అందిస్తాయి.

మజ్జిగను క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరంలోనే కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుముఖం పడుతుంది. రక్తపోటు నియంత్రణ లో ఉంటుంది.. ఎముకలకు కావాల్సిన బలాన్నిస్తుంది. మజ్జిగ శరీరంలో పేరుకు పోయిన మలినాలను బయటకు పంపుతుంది.

జీవ క్రియ రేటును పెంచి బరువు నియంత్రణ కు తోడ్పడుతుంది. తీసుకున్న ఆహారం జీర్ణం కావటానికి సాయపడుతుంది. అజీర్తి, అసిడిటీ సమస్యలను తగ్గించి రోగ నిరోధక శక్తి ని పెంచుతుంది. బరువు తగ్గాలనుకునే వారు. రోజూ ఉదయం మజ్జిగ తీసుకుంటే ఫలితం ఉంటుంది. 

పాలు పడని వారు, మధుమేహులు , ప్రత్యామ్నాయంగా దీన్ని తీసుకోవచ్చు. వేయించిన జీల కర్ర , ధనియాల పొడిని మజ్జిగలో కలిపి తీసుకుంటే చలువ చేయటంతో పాటు వాతం, కఫము వాటి సమస్యలు తగ్గుతాయి. మజ్జిగలో కాస్తంత సొంఠి పొడి వేసి తాగితే ఆకలి పెరుగుతుంది.

మజ్జిగలో ఇంగువనూ, జీలకర్రనూ, సైంధవ లవణాన్నీ కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరింపు తగ్గుతుంది.  పైల్స్ వ్యాధిలో మజ్జిగ బాగా పనిచేస్తుంది. మజ్జిగ పోసిన చోట గడ్డి మొలవదు. అలాగే మజ్జిగను ఎక్కువగా వాడేవారిలో పైల్స్ కూడా తయారుకావు.