రోహిత్‌ ఇన్నింగ్స్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా..

రోహిత్ శర్మ 20 బంతుల్లో 4 సిక్సర్లతో 46 పరుగులు చేశాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

న్యూజిలాండ్‌ ఆటగాడు మార్టిన్‌ గప్టిల్‌ (172)ను రోహిత్‌ వెనక్కునెట్టాడు.

ఈ 4 సిక్సర్లతో పాటు రోహిత్ 4 ఫోర్లు కూడా బాదాడు. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో 500కు పైగా బౌండరీలు బాదిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ నిలిచాడు.

రోహిత్ 504 బౌండరీలు బాదగా, మార్టిన్ గప్టిల్ 478తో రెండో స్థానంలో ఉన్నాడు.

రోహిత్ శర్మ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కెప్టెన్‌గా ఇది ఐదోసారి. కాగా, ఇతర భారత కెప్టెన్లందరూ 4 సార్లు (కోహ్లీ 3, రైనా 1) మాత్రమే ఈ అవార్డు అందుకున్నారు.

రోహిత్ శర్మ T20 అంతర్జాతీయ కెరీర్‌లో ఇది 12వ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు. ఈ విషయంలో విరాట్ కోహ్లీ, మహ్మద్ నబీ (ఇద్దరూ 13 సార్లు) ముందున్నారు.

కెప్టెన్‌గా రోహిత్ శర్మ 1351 పరుగులు చేశాడు. ఇందులో అతని స్ట్రైక్ రేట్ 154.93గా నిలిచింది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో వెయ్యికి పైగా పరుగులు చేసిన కెప్టెన్లలో రోహిత్ స్ట్రైక్ రేట్ మాత్రమే 150 కంటే ఎక్కువగా ఉంది.

ఇక టీమ్ ఇండియా గురించి చెప్పాలంటే.. ఈ మ్యాచ్ విజయంతో భారత్ ఈ ఏడాది 20 టీ20 మ్యాచుల్లో విజయం సాధించింది.

టీమ్ ఇండియా ఇన్ని విజయాలు సాధించడం ఇదే తొలిసారి. భారత్‌తో పాటు పాకిస్థాన్ (2021లో) మాత్రమే ఈ ఘనత సాధించింది.

విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్‌లో 11 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ ఆడమ్ జంపా బౌలింగ్‌లో ఔటయ్యాడు. కోహ్లీ వన్డేలు, టీ20ల్లో జంపాకు బలి కావడం ఇది 8వ సారి.