మంచి ఆరోగ్యానికి నీరు అత్యంత అవసరం. మరి రోజుకు ఎంత నీరు తాగాలి? తేలికైన ప్రశ్నే గానీ దీనికి సమాధానం చెప్పటమే కష్టం.

ఇది రకరకాల అంశాల మీద ఆధారపడి ఉంటుంది. అందరికీ ఒకే నియమం సరిపోదు.

ఒంట్లో నీటి శాతం తగ్గితే అనేక పనులన్నీ మందగిస్తాయి. కొద్దిపాటి నీరు తగ్గినా శక్తి, ఉత్సాహం సన్నగిల్లుతాయి. అలసట ముంచుకొస్తుంది.

కాబట్టి తగినంత నీరు తాగటం ప్రధానం. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు తాగాలనేది సాధారణ సిఫారసు.

అయితే ఎంత నీరు అవసరమనేది మన ఆరోగ్యంతో పాటు ఉష్ణోగ్రత, మన శారీరక శ్రమ, పనుల వంటి వాటి ఆధారపడి ఉంటుంది.

తగినంత నీరు తాగుతున్నామా? లేదా? అనేది గుర్తించటానికి తేలికైన మార్గం మూత్రం రంగు.

మామూలుగానైతే ఇది లేత పసుపు రంగులో ఉండాలి. ఏమాత్రం ముదురు రంగులోకి మారినా తగినంత నీరు తాగటం లేదనే అర్థం.

 నీరు తాగటానికి దాహం వేసేంతవరకు ఆగటం సరికాదు. మనకు దాహం వేసే సరికే ఒంట్లో నీటి శాతం తగ్గిపోయి ఉంటుందని తెలుసుకోవాలి.