కబంధ హస్తాలు అనే మాటను మనం తరచుగా వింటూనే ఉన్నాం ఈ పదం వెనక ఉన్న కథ ఏమిటంటే
వాల్మీకి రామాయణంలో కబంధుడు అనే పేరుగల శాపగ్రస్తుడైన ఒక రాక్షసుడు ఉన్నాడు
శ్రీరాముడు, లక్ష్మణుడు సీతను వెతుకుతూ అరణ్యంలో సంచరిస్తూ ఉండగా విచిత్ర రూపంలో ఉన్న ఓ రాక్షసుడు రామలక్ష్మణులకు ఎదురయ్యాడు
అతనికి తల, మెడ, కాళ్ళు లేవు. కడుపు భాగంలో మాత్రం ఓ పేద్ద నోరుంది. ఊరువుల ప్రదేశంలో రెండు ఉగ్రనేత్రాలున్నాయి
అతని బాహువులు మాత్రం ఎనిమిది యోజనాలవరకు విస్తరించి ఉన్నాయి
అటువంటి రాక్షసుడు ఒక్కసారిగా రామలక్ష్మణులను తన హస్తాలతో బంధించి గుప్పిట్లో బిగించాడు
భయకరమైన నోటిని తెరిచి వారిని ఆరగించబోతుండగా రాముడు కుడి చేతిని, లక్ష్మణుడు ఎడం చేతిని నరికివేయడంతో ఆ రాక్షసుడు నేలకు ఒరిగాడు
రామలక్ష్మణుల కారణంగా కబంధుడు తన శాపం పోగొట్టుకుని యధారూపానికి వచ్చాడు