వేసవిలో గర్భంతో ఉన్నవారు కాస్త ఎక్కువ అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. వేడి కారణంగా గర్భిణులకు అసౌకర్యం కలిగే అవకాశం ఉందని చెబుతున్నారు.
గర్భం దాల్చిన తొలి రోజుల్లో మహిళలకు వికారం, వాంతులు సహజమే. దాదాపు 60 నుంచి 70 శాతం మంది గర్భిణులకు ఇలా జరుగుతుంటుంది.
అయితే, తీవ్ర వాంతులు కలిగినప్పుడు శరీరంలో నీటి శాతం తగ్గిపోయి డీ హైడ్రేషన్ బారిన పడుతుంది. ఫలితంగా బలహీనతకు దారితీస్తుంది. వేసవిలో అయితే ఈ పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుంది.
గర్భాశయం పెరుగుతున్నకొద్దీ జీర్ణాశయాన్ని కాస్త పైకి నెట్టుతుంది. అదే విధంగా గర్భస్థ దశలో జీర్ణ ప్రక్రియ కాస్త నెమ్మదిస్తుంది.
ఆహారం చురుకుగా కదలదు. జీర్ణ క్రియ కండరాలు మొద్దు బారుతాయి. దీంతో ఆహారం జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది.
ఫలితంగా ఎక్కువగా ఆకలి అనిపించదు. ఒక్కోసారి యాసిడ్, ఫుడ్ అలాగే ఉండటంతో ఛాతిలో మంట కలుగుతుంది.
శరీర అవయవ భాగాల్లో నీరు చేరడాన్ని ఎడెమాగా సూచిస్తాం. గర్భం దాల్చిన తొలి 3 నెలల్లో పాదాలు, కాళ్లలో నీరు చేరిన భావన కలుగుతుంది. చెమట కూడా పడుతుంది.
వేసవిలో ఈ తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే, చెమటలు అదే పనిగా వస్తుంటే మాత్రం జాగ్రత్త పడాల్సిందే.
హై బీపీకి ఇదొక హెచ్చరికగా భావించాలి. ఇలాగే కొనసాగితే డాక్టర్‌ని సంప్రదించడం మంచిది.