ఎండ తీవ్రత పెరిగినప్పుడు శరీరం తన ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గుండె సాధారణం కంటే వేగంగా పని చేయాల్సి రావడంతో అది త్వరగా అలసిపోతుంది.
ఎండలు ముదురుతున్న వేళ వడదెబ్బతో పాటు గుండెపోటు ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల సోడియం, పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్స్ సమతుల్యత దెబ్బతింటుంది.
దీనివల్ల రక్తం చిక్కబడి గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. అలాగే వేడికి రక్తనాళాలు విస్తరించడం వల్ల ఒక్కసారిగా రక్తపోటు పడిపోవచ్చు.
వృద్ధుల్లో చెమట పట్టే సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల వారి శరీరం త్వరగా చల్లబడదు, ఇది గుండెపై భారాన్ని పెంచుతుంది.
ఇలాంటి వారు వైద్యుల సలహాతో తగినన్ని ద్రవ పదార్థాలు తీసుకోవాలి. రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. బయటకు వెళ్లేవారు ఓఆర్ఎస్ లేదా కొబ్బరినీళ్లు తీసుకోవడం మంచిది.
ఉదయం 10 నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగకపోవడమే శ్రేయస్కరం. వ్యాయామాలు కూడా ఉదయం లేదా సాయంత్రం వేళల్లోనే చేయాలి.
అధిక ఉప్పు, కొవ్వు పదార్థాలను దూరం పెట్టాలి. ఇవి రక్తపోటును పెంచి గుండెపై ఒత్తిడి తెస్తాయి.