చిన్నారులు కొద్దిసేపు తేలికపాటి వ్యాయామాలు చేసినా వారి మెదడులోని ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌కు రక్తసరఫరా మెరుగుపడుతుందని తాజా పరిశోధన తేల్చింది.
విషయగ్రహణ సామర్థ్యానికి సంబంధించి ఈ భాగానికి ముఖ్య పాత్ర ఉంది. జపాన్‌లోని వాసెడా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పరిశోధన నిర్వహించారు.
41 మంది చిన్నారులను ఎంపిక చేసుకున్నారు. ప్రత్యేక పరికరాలేమీ లేకుండానే అక్కడికక్కడే చేయగలిగే తేలికపాటి వ్యాయామాలను వారితో చేయించారు.
ఇందులో 10- 20 సెకన్ల పాటు శారీరక కదలికలు సాగాయి. ఆ సమయంలో స్పెక్ట్రోస్కొపీ అనే ఇమేజింగ్ విధానం సాయంతో ఈ చిన్నారుల మెదళ్లను శాస్త్రవేత్తలు పరిశీలించారు.
ఊపిరితిత్తుల నుంచి కణజాలాలకు ఆక్సిజన్‌ను చేరవేసే ఆక్సీహీమోగ్లోబిన్ స్థాయిని విశ్లేషించారు. మెదడులోని రక్త ప్రవాహంలో వచ్చిన మార్పులను గణించారు.
విశ్రాంతిగా ఉన్న సమయంతో పోలిస్తే.. వ్యాయామాలు చేసేటప్పుడు ప్రీఫ్రాంటల్ కార్టెక్స్‌లో ఆక్సీహీమోగ్లోబిన్ సరఫరా మెరుగుపడినట్లు గుర్తించారు.
భవిష్యత్‌లో విషయ గ్రహణ సామర్థ్యంలో క్షీణతను తప్పించుకోవడానికి పెద్దలు కూడా వీటిని చేయవచ్చని వివరించారు.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ పిల్లల ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే ఇలాంటి తేలికపాటి వ్యాయామాలను చేయించండి.