భారత్, జపాన్, చైనాల్లో తినే శాకాహారం, సంప్రదాయ భోజనంతో అల్జీమర్స్ ముప్పు తగ్గుతుందని అమెరికాలోని సన్‌లైట్, న్యూట్రిషన్, హెల్త్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు గుర్తించారు.
పశ్చిమ దేశాల ఆహారపుటలవాట్ల వైపు మళ్లడం వల్ల భారత్ వంటి చోట్ల కూడా అల్జీమర్స్ ముప్పు పెరుగుతోందని తెలిపారు.
పరిశోధనలో భాగంగా సన్‌లైట్, న్యూట్రిషన్, హెల్త్ రీసెర్చ్ సెంటర్ శాస్త్రవేత్తలు అల్జీమర్స్ వ్యాధిపై ఆహారం చూపే ప్రభావాన్ని పరిశీలించారు.
మాంసం.. ముఖ్యంగా రెడ్ మీట్, ప్రాసెస్డ్ మాంసంతో తయారైన బర్గర్లు, చక్కెర స్థాయి ఎక్కువుండే ప్రాసెస్డ్ ఆహారం వల్ల తీవ్ర మతిమరుపు ముప్పు పెరుగుతుందని గుర్తించారు.
మాంసాహారం వల్ల వాపు, ఇన్సులిన్ నిరోధకత వంటివి శరీరంలో పెరగొచ్చని, ఇవన్నీ తీవ్ర మతిమరుపు ముప్పును పెంచేవేనని వివరించారు.
ఆకు కూరలు, పండ్లు, కూరగాయలు, బీన్స్, నట్స్, ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల అల్జీమర్స్‌ను దూరం చేయవచ్చని తెలిపారు.
తీవ్రస్థాయిలో ప్రాసెస్ చేసిన ఆహారం వల్ల ఊబకాయం, మధుమేహం పెరుగుతాయనీ ఆ రెండు అంశాలు కూడా అల్జీమర్స్‌కు ఆస్కారాన్ని పెంచేవేనని వివరించారు.
శాకాహారంలో లభించే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలు తీవ్ర మతిమరుపు ముప్పును తగ్గిస్తాయని పేర్కొన్నారు.