పట్టీలు అమ్మాయిల మనసు దోచుకోవడమే కాదు, మగవారి గుండెల్లో కూడా అలజడి రేపుతుంటాయని కవులు వర్ణిస్తుంటారు.
‘కాలి అందియలు ఘల్లుఘల్లుమన రాజహంసలా రావే..’, ‘గజ్జె ఘల్లుమన్నాదిరో గుండె జల్లుమన్నాదిరో’ అంటూ సినీ కవులు పాటలు కట్టారు.
పట్టీలు, అందియలు, గజ్జెలు..లని ప్రాంతానికో పేరుతో పిలిచే ఈ అభరణాలంటే మగువలకు ఎంతో మురిపెం. ఒకప్పుడు పెద్దా, చిన్నా తేడాలేకుండా ప్రతి మహిళా వీటిని ధరించేవారు.
అయితే, వీటిల్లో ఎక్కువగా వెండివే కనిపిస్తుంటాయి. కాళ్లకు నిండుగా పట్టే ఈ చిరుమువ్వలు నిశ్శబ్ద వాతావరణంలో మంత్రనాదంలా మోగుతూ అందరి దృష్టినీ ఆకర్షించేవి.
ఇవి నాడుల్ని ప్రేరేపితం చేసి ఆరోగ్యంగా ఉంచుతాయనేది పెద్దల నమ్మకం. వెండితోపాటు కొందరు బంగారు పట్టీలు కూడా ధరిస్తుంటారు. అయితే చాలా అరుదుగా మాత్రమే గోల్డ్ పట్టీలు ధరిస్తారు.
ఈ మధ్య కాలంలో అచ్చంగా పసిడిని తలపించేలా పంచలోహాలతో చేసిన పట్టీలకూ ప్రాధాన్యం పెరిగింది. పంచలోహాలంటే.. బంగారం, వెండి, రాగి, జింక్, ఇనుము అనే ఐదు లోహాల కలయిక.
ఇవి పుత్తడిని పోలి ఉండటం, మెరుపూ ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో వీటితో చేసిన అందెలకు ఆదరణ లభిస్తోంది. పంచలోహా ఆభరణాల వల్ల ఆరోగ్యం, మానసిక ప్రశాంతత లభిస్తాయట.
ఎప్పట్నుంచో ఇవి మగువల అలంకరణలో ఉన్నా కాలక్రమంలో వచ్చిన నయా డిజైన్లనూ అద్దుకుని సందడి చేస్తున్నాయి. పూసలు, ముత్యాలు, రాళ్లూ... వంటి హంగులతో పాదాలకు సొగసులీనుతున్నాయి.