వినాయక నిమజ్జనం.. ఈ చిత్రాలపై ఎఫెక్ట్ పడనుందా..

25 September 2023

సెప్టెంబర్ 28 కావాలి.. దానికంటే గొప్ప డేట్ దొరకదు అంటూ నానా హంగామా చేసారు మన నిర్మాతలు. ఐదు రోజుల వీకెండ్ అంటూ పండగ చేసుకున్నారు.

కానీ అసలు విషయాన్ని మాత్రం మరిచిపోయారేమో అనిపిస్తుంది. బొజ్జ గణపయ్యాను సాగనంపే టైమ్‌లో కొత్త సినిమాలను చూడ్డానికి థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా..?

సలార్ వాయిదా వార్త వచ్చిన రోజు నుంచే సెప్టెంబర్ 28 కోసం చాలా సినిమాలు పోటీ పడ్డాయి. ఒకేసారి అరడజన్ సినిమాలు రిలీజ్ డేట్స్ కన్ఫర్మ్ చేసుకోగా మ్యాడ్, రూల్స్ రంజన్ తప్పుకున్నాయి.

ప్రస్తుతానికి స్కందతో పాటు చంద్రముఖి 2 బరిలో ఉన్నాయి. సెప్టెంబర్ 29న పెదకాపు విడుదల కానుంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది.

సెప్టెంబర్ 28 గురువారం.. ఆ తర్వాత వీకెండ్ మొదలవుతుంది.. అలాగే అక్టోబర్ 2 సోమవారం గాంధీ జయంతి కాబట్టి మరో హాలీడే ఉంటుంది. లాంగ్ వీకెండ్ కాబట్టి అంతా పోటీ పడ్డారు.

అయితే హైదరాబాద్ సహా చాలా నగరాల్లో సెప్టెంబర్ 28న వినాయక నిమజ్జనం ఉంది. కచ్చితంగా ఆ ఎఫెక్ట్ కొత్త సినిమాల ఓపెనింగ్స్‌పై పడే ప్రమాదం లేకపోలేదు.

గణేష్ నిమజ్జనం అంటే కోలాహలం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అప్పుడందరి ఫోకస్ వినాయకులపైనే ఉంటుంది కానీ సినిమాలపై కాదు.

పైగా తర్వాతి రోజు కూడా ఆ ప్రభావం కంటిన్యూ అవుతుంది. అలాంటప్పుడు సెప్టెంబర్ 28, 29న విడుదల కానున్న స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1 ఓపెనింగ్స్ కాస్తైనా తగ్గుతాయనేది ట్రేడ్ అంచనా.

ఎంత కాదన్నా.. నిమజ్జనం రోజు ఎఫెక్ట్ బాగానే ఉంటుంది. కానీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం వీకెండ్ హెల్ప్ అవ్వడం ఖాయం. ఆ తర్వాతైనా 4 డేస్ ఉన్నాయి కాబట్టి నిర్మాతలకు పెద్దగా కంగారుండదు.

కానీ ఇప్పుడంతా ఫస్ట్ డే మేనియా నడుస్తుంది. అప్పుడొచ్చే కలెక్షన్సే మెయిన్. మరిలాంటి సమయంలో నిమజ్జనం ధాటి తట్టుకుని.. బాక్సాఫీస్ దగ్గర స్కంద, చంద్రముఖి 2 పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందో చూడాలి.