కామెడీ మాత్రమే కాదు.. మెగాఫోన్ పట్టి డైరెక్షన్ కూడా..

10 October 2023

ఏ పుట్టలో ఏ పాము ఉందో ఎవరికి తెలుసు..? సత్తా ఏంటో తెలియకుండా ముందుగానే అంచనా వేయడం చాలా తప్పు. ఇండస్ట్రీలో కొందరు కమెడియన్లను చూస్తుంటే ఇదే అనిపిస్తుందిప్పుడు.

నవ్విస్తున్నారు కదా అని వాళ్లకు అది తప్ప ఇంకేం రాదనుకుంటే పొరపాటే. తాజాగా బలగం వేణు దారిలోనే మరో కమెడియన్ మెగాఫోన్ పడుతున్నాడు. మరి ఆయనెవరు..?

బలగం సినిమాకు ముందు వేణు అంటే కేవలం కమెడియన్ మాత్రమే. అది కూడా స్టార్ కాదు.. అప్పుడప్పుడూ సినిమాల్లో.. ఎప్పుడూ టీవీలో కనిపించే చిన్న కమెడియన్.

కానీ ఇప్పుడు ఆయన మంచి దర్శకుడు. బలగంతో వేణు రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. తాజాగా వేణు దారిలోనే ఆయన ఫ్రెండ్ ధన్‌రాజ్ కూడా దర్శకుడు అవుతున్నారు.

నటుడిగా అంతగా అవకాశాలు రాకపోవడంతోనే వేణు దర్శకుడిగా మారిపోయారు. బలగం తర్వాత రెండో సినిమాను కూడా దిల్ రాజు నిర్మాణంలోనే స్టార్ హీరోతో చేయబోతున్నారు.

తాజాగా ధన్‌రాజ్ సైతం తన కథతో సముద్రఖని లాంటి నటుడిని మెప్పించారు. హీరో, కమెడియన్, నిర్మాత అన్నీ ట్రై చేసినా ధన్‌రాజ్‌కు ఫలితం దక్కలేదు. దాంతో దర్శకుడిగా మారుతున్నారిప్పుడు.

సముద్రఖనికి కథ చెప్పడమే కాదు.. ఆయన ప్రధాన పాత్రలో సినిమా మొదలు పెట్టబోతున్నారు ధన్‌రాజ్. గతంలో జబర్దస్త్ నుంచి వచ్చిన కమెడియన్ శ్రీధర్ కూడా దర్శకుడిగా రెండు సినిమాలు చేసారు.

ఇక కమెడియన్లలో చూసుకుంటే వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల, ఎమ్మెస్ నారాయణ లాంటి వాళ్ళు కూడా గతంలో మెగాఫోన్ పట్టినవాళ్లే. ఇప్పుడు ధన్‌రాజ్ ఏం చేస్తారో చూడాలిక.