13 November 2023

వెండి వెలుగుల్లో చంద్రుడిలా చంద్రమోహన్ జ్ఞాపకాలు.

తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు. 

హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా... ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్‌. 

నవరసాలను పలికించగలిగిన నటులను గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ  శివాజీ గణేశన్‌, కమల్‌హాసన్‌తో పాటు చంద్రమోహన్‌ పేరు కూడా తప్పక వినిపిస్తుంది. 

సినిమా రంగంలో చంద్రమోహన్‌కి మరింత ఆత్మవిశ్వాసం తెచ్చిపెట్టిన సినిమా ఓ సీత కథ.

ఆయనకు నంది అవార్డును, ఫిల్మ్ ఫేర్‌ అవార్డును కూడా తెచ్చి పెట్టిన సినిమా ఇది. 

ఓ సీత కథ చంద్రమోహన్‌కి ఎంత ఇష్టమైన సినిమానో, ఆయన చేసిన పదహారేళ్ల వయసు ప్రేక్షకులకు అంతగా నచ్చిన చిత్రం. 

1977లో విడుదలైన పదహారేళ్ల వయసులో చంద్రమోహన్‌ని చూసిన వారు ఏం నటుడురా అని మెచ్చుకున్నారు. 

తమిళంలో కమల్‌హాసన్‌ ఎంత అద్భుతంగా చేశారో, తెలుగులో చంద్రమోహన్‌ అంతే బాగా చేశారంటూ ప్రశంసల వర్షం కురిసింది. 

కె.విశ్వనాథ్, చంద్రమోహన్ కాంబినేషన్‌లో చరిత్రలో నిలిచిపోయిన సినిమా శంకరాభరణం. అందులో చంద్రమోహన్‌ నటననూ అంత తేలిగ్గా ఎవరూ మర్చిపోలేరు. 

ఇలా ఎన్నో.. మరెన్నో సంచలనాలు చంద్రమోహన్ సినీ జీవితంలో ఉన్నాయి. ఇలాంటి మహోన్నత వ్యక్తి ఇప్పుడు మన మధ్య లేదు.

వెండి వెలుగుల్లో చంద్రుడిలా ఆయన జ్ఞాపకాలు మాత్రం మన మనస్సుల్లో కలకాలం పదిలంగా ఉంటాయి.