నవరసాలను అవలీలగా పోషించిన సినిమా నటుడిగా తెలుగు చలనచిత్ర చరిత్రలో చెరిగిపోని సంతకం చేశారు చంద్రమోహన్.
అమాయక చక్రవర్తిగా, మధ్య తరగతి మగవాడిగా, కుటుంబ భారాన్ని మోసిన ఉద్యోగస్తుడిగా, అన్నగా, తండ్రిగా ఆయన చేయని పాత్రా లేదు. ఆయన్ని వెతుక్కుంటూ రాని పాత్రా లేదు.
తెలుగు తెరపై వివిధ పాత్రల్లో నటించి తనకంటూ సువర్ణాధ్యాయాన్ని రాసుకున్న నటుల్లో చంద్రమోహన్ కూడా ఒకరు.
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, తండ్రిగా... ఒక్కటేంటి? ఏ పాత్రలోనైనా ఒదిగిపోగలడని పేరు తెచ్చుకున్న నటుడు చంద్రమోహన్.
నవరసాలను పలికించగలిగిన నటులను గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ శివాజీ గణేశన్, కమల్‌హాసన్‌తో పాటు చంద్రమోహన్ పేరు కూడా తప్పక వినిపిస్తుంది.
అంతగా పాత్రల్లో మమేకమై నటించారు చంద్రమోహన్. అయితే ఆయనకు అప్పటికి సినిమా ఇండస్ట్రీలో బ్యాక్‌గ్రౌండ్ లేదు.
బీఎస్సీ చదువుకున్న ఆయన అగ్రికల్చర్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేసేవారు. అప్పటికి సమాజంలో కుర్రకారును ఆకట్టుకుంటున్న నాటకాల వైపు మాత్రం బాగా మొగ్గుచూపేవారు.
తల్లికి అసలు ఇష్టం లేకపోయినా సర్ది చెప్పుకుని చెన్నైకి ప్రయాణమయ్యారు. రంగులరాట్నం సినిమాలో కొడుకుని చూసుకున్నాక తల్లి మనసు కుదుటపడింది.