ఎమర్జెన్సీ సినిమాను ఆమె స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడింది. దీని గురించి కంగన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
''ప్రజలతో ఓ కీలక విషయాన్ని పంచుకుంటున్నాను. నా జీవితాంతం నేను సంపాదించిన మొత్తాన్ని ఎమర్జెన్సీ కోసం ఖర్చుపెట్టాను.
ఎమర్జెన్సీ అనేది కేవలం సినిమా మాత్రమే కాదు. నేనేంటో చెప్పే సినిమా. నా కేరక్టర్‌ని చెప్పే సినిమా. నా సమర్థతను ప్రూవ్ చేసే సినిమా.
ఇప్పటికే విడుదలైన టీజర్‌కి చాలా మంచి స్పందన వస్తోంది. ప్రతి చోట నుంచీ అందుతున్న సందేశాలు స్ఫూర్తిమంతంగా ఉంటున్నాయి.
ప్రేక్షకుల ప్రశంసలు చూసి మనసు ఆనందంతో నిండిపోయింది. నేనెక్కడికి వెళ్లినా ఎమర్జెన్సీ రిలీజ్ డేట్ గురించి అభిమానులు మళ్లీ మళ్లీ అడుగుతున్నారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందనను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది నవంబర్ 24న విడుదల చేద్దామని అనుకున్నాం. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా చేసుకున్నాం.
కానీ, ఈ మధ్య నేను నటించిన సినిమాలు వరుసగా విడుదలయ్యాయి. ఆ పనులలో మునిగిపోయాను. దానికి తోడు, ఈ ఏడాది ఆఖరున చాలా సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.
అందుకే ఎమర్జెన్సీని వచ్చే ఏడాదికి వాయిదా వేస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ని వరుసగా అనౌన్స్ చేస్తాం'' అని అన్నారు. ఎమర్జెన్సీ అక్టోబర్ 20న విడుదల కావాల్సింది.